ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్ వివాదానికి దారి తీసింది. అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు ప్రత్యేక స్కిట్ వేశారు. పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి.. అయోధ్యలోని శ్రీరాముని ఫొటోను చేతిలో పట్టుకుని.. భక్తుల నుంచి కానుకలు స్వీకరిస్తున్న ఆలయ పూజారిగా నటిస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఇప్పుడు వివాదంగా మారింది. కొందరు సాధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాహుల్ గాంధీ సహా పలువురిపై కేసు నమోదైంది.
అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల్లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగిందంటూ పార్లమెంట్ వెలుపల ఇండియా కూటమి నేతలు నిర్వహించిన నిరసనపై సాధు సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించిన తీరు సనాతన ధర్మాన్ని అవమానించేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సాధు సమాజం సభ్యులు హెచ్చరించారు.
కాశీ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు అందిందని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలకు సంబంధించి ఫిర్యాదు నమోదైనట్లు చెప్పారు. ఆ వీడియోల్లో పప్పు యాదవ్ సాధువు వేషధారణలో కనిపిస్తూ.. సనాతన ధర్మాన్ని అవమానించేలా కొన్ని చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదుదారులు ఆరోపించినట్లు వెల్లడించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తున్నామని, తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ గౌరవ్ బన్స్వాల్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత దర్యాప్తును ముందుకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న సమయంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయోధ్య రామమందిర విరాళాల సేకరణలో అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్‌లోని మకర ద్వారం సమీపంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జవాబుదారీతనం వహించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా ఇటీవల ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు తీసుకున్న చర్యలపై కూడా అమిత్ షా స్పందించాలని ప్రతిపక్ష సభ్యులు కోరారు. పార్లమెంట్ ప్రాంగణంలో ‘‘చందా చోర్, గద్దీ ఛోడ్’’, ‘‘జవాబ్ తుమ్‌కో దేనా హోగా’’, ‘‘అమిత్ షా, సదన్ మే ఆవో’’ అంటూ నినాదాలు చేశారు.
పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆలయ పూజారి పాత్రను పోషిస్తూ.. భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అయోధ్య రామమందిరానికి సంబంధించిన శ్రీరాముడి చిత్రాన్ని కూడా ఆయన చేతిలో పట్టుకున్నారు. పప్పు యాదవ్ ప్రదర్శించిన ఈ స్కిట్ సనాతన ధర్మాన్ని అవమానించేలా ఉందని సాధు సమాజం ఆరోపించడంతో వివాదం చెలరేగింది.
ఈ ఘటనపై రాహుల్ గాంధీ, పప్పు యాదవ్, అవధేశ్ ప్రసాద్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సంబంధిత నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
A case has been registered at Kotwali Police Station in Varanasi against Congress MP Rahul Gandhi, Samajwadi Party MP Awadhesh Prasad, and MP Pappu Yadav on a complaint filed by saints, alleging that they hurt religious sentiments. pic.twitter.com/F5Ia8aSfHG
— IANS (@ians_india) August 1, 2026
#WATCH | Varanasi, UP | Deputy Commissioner of Police (DCP) for the Kashi Zone, Gaurav Banswal, says, “Mahant Balak Nath Ji has submitted a formal complaint at the Kotwali police station. The complaint concerns certain videos that went viral on social media, in which Rajesh… pic.twitter.com/Qpmcw2E4DL
— ANI (@ANI) August 1, 2026

