Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..

  • రాహుల్ గాంధీ ‘‘పరువునష్టం’’ కేసులో రేపు కోర్టు తీర్పు..
  • 2018లో అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో కేసు..
Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించిన ‘‘పరువు నష్టం’’ కేసులో సుల్తాన్ పూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం, అక్టోబర్ 26న తీర్పు వెలువరించబోతోంది. 2018లో అప్పటి బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్‌షాపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. తీర్పు వెలువడే సమయంలో రాహుల్ గాంధీ స్వయంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

2018లో కర్ణాటకలోని బెంగళూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, అమిత్ షాను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత, జిల్లా సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడు విజయ్ మిశ్రా అదే ఏడాది ఆగస్టు 4న ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 2023 నవంబర్ 27న విచారణను ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు ​​జారీ చేసింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ హాజరుకాగా, ఆయనకు బెయిల్ మంజూరైంది.

అయితే, ఈ కేసులో ఫిర్యాదిదారు అయిన విజయ్ మిశ్రా, ఆ తర్వాత రాహుల్ గాంధీ వాయిస్ శాంపిల్ పోలిక కోసం అభ్యర్థించారు. ట్రయల్ కోర్టు మిశ్రా పిటిషన్‌ను కొట్టివేయగా, సెషన్స్ కోర్టు కూడా ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టివేసింది. రెండు కోర్టుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్‌ను హైకోర్టు కూడా కొట్టివేసింది.