Site icon NTV Telugu

Rahul Gandhi: శ్రీరామనవమి వేడుకల్లో హింస.. తీవ్రంగా స్పందించిన రాహుల్

Rahul Gandhi

Rahul Gandhi

గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన శ్రీరామ నవమి హింసాత్మక ఘటనలపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. విద్వేషం, హింస భారత దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సౌభ్రాతృత్వం, శాంతి, సామరస్యంతో కూడిన పునాదులు పురోగతికి మార్గం వేస్తాయన్నారు. భిన్న సంస్కృతి, సమ్మిళిత భారతదేశాన్ని కాపాడుకునేందుకు కలిసి నిలబడాలని ట్వీట్‌ చేశారు. శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా మధ్యప్రదేశ్‌ ఖార్గోన్ నగరంలో అల్లర్లు చెలరేగాయి. కనీసం 10 ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పోలీసులు సహా 20 మందికి పైగా గాయపడ్డారు. ఊరేగింపు తలాబ్ చౌక్ ప్రాంతం నుండి బయలుదేరినప్పుడు రాళ్ల దాడి జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హింసలో పాల్గొన్న నిందితుల ఇళ్లను కూల్చివేసింది. ఛోటీ మోహన్ టాకీస్ ఏరియాలో 50 ఇళ్లను కూల్చేశారు. ఆస్తి నష్టాన్ని తిరిగి పొందేందుకు ఇళ్లను కూల్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 77 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Omicron Xe: ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియంట్.. ఊరటనిచ్చే న్యూస్‌..!

గుజరాత్‌లోని రెండు నగరాల్లో ఘర్షణలు చెలరేగడంతో ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం. హిమ్మత్‌నగర్, ఖంభట్ నగరాల్లో రెండు వర్గాల మధ్య మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పాటు దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేశారు. దాంతో గుంపును నియంత్రించడానికి పోలీసులను టియర్ గ్యాస్ షెల్స్‌ ప్రయోగించారు. అటు జార్ఖండ్‌లోనూ రెండు జిల్లాల్లో ఘర్షణలు ఉద్రిక్తతకు దారితీశాయి. లోహర్దగా జిల్లాలోని హిర్డి గ్రామంలో శ్రీరామనవమి ఊరేగింపులో రాళ్లదాడికి పాల్పడ్డారు. ఎనిమిది మందికి గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా హింసాత్మక కేసులు చోటుచేసుకున్నాయి. ఇక వివాదాలకు మారుపేరైన జేఎన్‌యూలోనూ ఘర్షణలు చెలరేగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక, రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది..

Exit mobile version