RS 12 Crore Lottery Jackpot: గెలిపించిన నమ్మకం.. 15 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. ట్రక్ డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ!

Punjab Lottery 2026

Punjab Lottery 2026

RS 12 Crore Lottery Jackpot: అదృష్టం ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఒక్కరోజులోనే ఫలితం దక్కుతుంది. పంజాబ్‌లో ఓ ట్రక్ డ్రైవర్ విషయంలో ఇదే జరిగింది. గత 15 ఏళ్లుగా ప్రతి పండుగకు లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న ఓ వ్యక్తికి ఎట్టకేలకు భారీ జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.12 కోట్ల బంపర్ లాటరీని గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాకు చెందిన బల్జీందర్ సింగ్ అనే ట్రక్ డ్రైవర్ 2026 పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ లాటరీలో మొదటి బహుమతిని గెలుచుకున్నాడు.

దీంతో ఆయన కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. గ్రామస్థులు సైతం ఆయన ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొహాలీలోని డేరా బస్సీ ప్రాంతంలో ఉన్న హమాయున్‌పూర్ గ్రామానికి చెందిన బల్జీందర్ సింగ్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత 15 ఏళ్లకు పైగా ప్రతి పండుగ సమయంలో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. 2010 నుంచి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొంటున్నప్పటికీ ఇప్పటివరకు అదృష్టం వరించలేదు. అయినప్పటికీ ఆయన ఆశను వదులుకోలేదు. ఎప్పటికైనా లాటరీ తగులుతుందనే నమ్మకంతో టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. చివరకు ఆయన నిరీక్షణకు తెరపడింది. పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ లాటరీలో మొదటి బహుమతిగా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.

బల్జీందర్ సింగ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా పెద్దగా చెప్పలేదట. లాటరీలో విజయం సాధించిన అనంతరం తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 2010 నుంచి ప్రతి పండుగకు లాటరీ టికెట్లు కొంటున్నానని, ఒకరోజు దేవుడు తన ప్రార్థనలు ఆలకించి బహుమతి అందిస్తాడని ఎప్పుడూ నమ్మేవాడినని తెలిపాడు. ఇప్పుడు తన కల నిజమైందని, తాను ఎంతో అదృష్టవంతుడినని ఆనందం వ్యక్తం చేశాడు. బల్జీందర్ సింగ్‌కు రూ.12 కోట్ల లాటరీ తగిలిందన్న వార్త తెలియగానే ఆయన స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నారు. పలువురు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు పంజాబ్‌లోని సంగ్రూర్‌లో కూడా ఓ వ్యక్తికి రూ.కోటి లాటరీ తగిలినట్లు సమాచారం. నవంబర్ 16న పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ 2026 డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో సంగ్రూర్‌కు చెందిన ఓ వ్యక్తి కోటి రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు. అయితే చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఆ విజేత ఎవరో ఇంకా గుర్తించలేదు. సంగ్రూర్ బస్టాండ్ సమీపంలోని లాటరీ దుకాణంలో టికెట్లు కొనుగోలు చేసినవారు తమ టికెట్లను మరోసారి పరిశీలించుకోవాలని దుకాణదారుడు విజ్ఞప్తి చేశాడు. మొత్తానికి 15 ఏళ్లుగా లాటరీ అదృష్టం కోసం ఎదురుచూసిన ఓ సాధారణ ట్రక్ డ్రైవర్‌కు ఏకంగా రూ.12 కోట్ల బహుమతి రావడం ఇప్పుడు పంజాబ్‌లో చర్చనీయాంశంగా మారింది.