Priya Saroj Viral Video: ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎంపీ ప్రియా సరోజ్ అసౌకర్యానికి గురైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఘటన జౌన్‌పూర్ జిల్లా కెరాకట్ నియోజకవర్గంలో జరిగినట్లు సమాచారం. జనవరి 19న కెరాకట్‌లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ దంగల్ పోటీకి ప్రియా సరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో, ఒక పార్టీ మద్దతుదారుడు వేదికపైకి వచ్చి ఆమెకు అత్యంత దగ్గరగా కూర్చున్నాడు. తొలుత ఆ వ్యక్తి ఎంపీ పాదాలను తాకగా, అనంతరం ఆమె చెవిలో ఏదో గుసగుసలాడినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ ఘటనతో ఎంపీ ప్రియా సరోజ్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆమె ఆ వ్యక్తిని దూరంగా కూర్చోవాలని సంకేతాలు చేసినప్పటికీ, అతడు వినకపోవడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ సమయంలో ఆమె వెనుక కూర్చున్న మరో వ్యక్తి ఆ మద్దతుదారుడిని లేవమని సూచించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ మొత్తం ఘటనను ఎవరో వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది క్షణాల్లో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మహిళా ఎంపీ పట్ల జరిగిన ఈ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ఘటనపై ప్రియా సరోజ్ అధికారిక స్పందన ఇవ్వలేదు. అలాగే, అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని కూడా ఇంకా గుర్తించలేదు.
ఇంతకీ ప్రియా సరోజ్ ఎవరు?
2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీలలో ఒకరిగా ప్రియా సరోజ్ గుర్తింపు పొందారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే సమాజ్‌వాదీ పార్టీ తరఫున మచ్లిషహర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ప్రియా సరోజ్ రాజకీయ నేపథ్యమున్న కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేయడంతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వారణాసిలో జన్మించిన ప్రియా, ఢిల్లీ విశ్వవిద్యాలయం మరియు అమిటీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు. అఖిలేష్ యాదవ్ ఆమెను తన తండ్రికి బలమైన ప్రత్యామ్నాయంగా మచ్లిషహర్ నుంచి బరిలోకి దించారు. ఇటీవల ప్రియా సరోజ్ ప్రముఖ క్రికెటర్ రింకు సింగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
