NTV Telugu Site icon

UP: యూపీలో ఘోరం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్

Upschool

Upschool

విద్యార్థులకు మంచి చదువు, మంచి భవిష్యత్ అందించాల్సిన విద్యాసంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయి. కొన్ని విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా విద్యాలయాలను నడిపిస్తున్నాయి. దీంతో ముక్కుపచ్చలారని చిన్నారులు వారి ధన దాహానికి బలైపోతున్నారు. తల్లిదండ్రుల ఫీజులు కట్టకపోతే.. విద్యార్థులను శిక్షించడమేంటి? పిల్లలకు స్కూల్ వెళ్లి చదువుకోవడమే తెలుసు. అలాంటిది ఫీజు కట్టలేదని మండుటెండలో విద్యార్థులను కూర్చోబెట్టి శిక్షించారు. దీంతో ఎండ వేడిమి తట్టుకోలేక ఆ చిన్నారులు విలవిలలాడిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Sree Vishnu: మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనేదే కథ : హీరో శ్రీవిష్ణు ఇంటర్వ్యూ

యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులను మండుటెండలో ప్రిన్సిపాల్ కూర్చోబెట్టాడు. తల్లిదండ్రుల నుంచి ఫీజులు రాబట్టేందుకు విద్యార్థులకు దండన విధించాడు. ఎండలో విద్యార్థులు కూర్చోలేక తల్లడిల్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ప్రిన్సిపాల్ మొబైల్‌లో చిత్రీకరించి.. పేరెంట్స్ ఫోన్లకు పంపించి హెచ్చరించాడు. ఫీజు చెల్లిస్తేనే అనుమతిస్తామని.. లేదంటే ఇంటికి పంపిస్తామని తల్లిదండ్రులకు వార్నింగ్ ఇస్తూ వీడియో పంపించాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తీవ్ర ఆగ్రహావేషాలు వ్యక్తమయ్యాయి. శ్యామ్‌రాజీ హైస్కూల్ యాజమాన్యంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇక ఈ ఘటన సిగ్గుచేటని పేర్కొంటూ పాఠశాలల జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల రిజిస్టర్ అయిందో లేదో విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Minister Vangalapudi Anitha: త్వరలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం..

రెండు నిమిషాల వీడియోలో చిన్నపిల్లలు, బాలికలు పాఠశాల గేటు ముందు కూర్చున్నారు. బయటకు వెళ్లే మార్గంలో ఇరువైపులా పొలాలు ఉన్నాయి. వీడియోలో విద్యార్థులు సిగ్గుతో ముఖాలు కప్పుకున్నారు.

ప్రిన్సిపాల్ శైలేష్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘ఫీజులు కట్టకపోతే మీ పిల్లలను పాఠశాలకు పంపవద్దని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నా. కానీ మీరు వినరు. నన్ను ఇబ్బంది పెట్టడానికి మీరు వారిని పాఠశాలకు పంపారు. అందరూ డిఫాల్టర్లు మరియు నేను వారిని ఈ రోజు గేట్ వెలుపల ఉంచాను … నేను మీకు కఠినమైన హెచ్చరిక ఇస్తున్నాను … మీకు బాధగా అనిపిస్తే దానికి మీరే బాధ్యులు.’’ అంటూ వ్యాఖ్యానించారు.

‘‘బ్యాంకు నాకు రూ. 50,000 జరిమానా విధించింది. మీరు రుసుము అదనంగా రూ. 5 కూడా చెల్లించరు. నేను ఈ భారం తీసుకోలేను. ప్రతి నెలా 15వ తేదీలోపు ఫీజు చెల్లించకపోతే ఒక్కొక్కరికి రూ. 5 జరిమానా విధించబడుతుంది. ఈ నియమాన్ని ఎవరు పాటించగలరో వారు తమ పిల్లలను ఇక్కడకు పంపవచ్చు. మీరు చేయకపోతే మీరు వారిని ఇంట్లో ఉంచుకోవచ్చు. నాపై ఒత్తిడి ఉంది. నా జీవితాంతం రూపాయి రుణాన్ని కూడా పొందలేదు. నేను వారిని (విద్యార్థులు) చివరిసారిగా ఫీజు చెల్లించకుండా లోపలికి పంపుతున్నాను. లేదంటే ఇంటికి పంపిస్తాం’’ అని హెచ్చరించారు.

మీడియా ప్రతినిధులు ఆగ్రహంతో ప్రిన్సిపాల్ త్రిపాఠిని ప్రశ్నించారు. ‘‘ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. అయితే పాఠశాలకు విద్యార్థికి రూ. 10,000 నుంచి లక్షల వరకు బకాయి ఉన్నందున తనకు వేరే మార్గం లేదు. విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టడాన్ని నేను సమర్ధించను. వీడియో చిత్రీకరించడానికి రెండు నిమిషాలు మాత్రమే అలా చేశాం. మేము తల్లిదండ్రులకు అనేక సార్లు గుర్తు చేశాం. కానీ మాకు స్పందన లేదు. కొంతమంది విద్యార్థులు నాలుగు సంవత్సరాలుగా ఫీజు చెల్లించలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘నేను సమాచారాన్ని పంచుకోవడానికి తల్లిదండ్రుల గ్రూప్‌లో మాత్రమే వీడియోను షేర్ చేశాను. కొంతమంది తల్లిదండ్రులు దానిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎవరికైనా బాధగా అనిపిస్తే క్షమించండి. కానీ మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాకు మాత్రమే తెలుసు.’’ అని ప్రిన్సిపాల్ త్రిపాఠి తెలిపారు. అయితే ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.

Show comments