NTV Telugu Site icon

Atal Bihari Vajpayee: రాజకీయ దురంధరుడు వాజ్‌పేయ్ వర్ధంతి.. ప్రముఖుల నివాళి

Atal Bihari Vajpayee

Atal Bihari Vajpayee

Atal Bihari Vajpayee: భారత మాజీ ప్రధాని, దివంగత నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయ్ వర్ధంతి(ఆగస్టు 16) సందర్భంగా ఢిల్లీలో ప్రముఖులు నివాళులర్పించారు. వాజ్‌పేయి స్మారక కేంద్రం అటల్ సదైవ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధాని మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ తదితరులతో పాటు వాజ్‌పేయి దత్తత కూతురు నమితా కౌల్‌ భట్టాచార్య సైతం ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. వాజ్‌పేయి సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆలోచనలు, మాటలు ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయన్నారు. దేశ అభివృద్ధికి అటల్‌జీ చేసిన సేవలను మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్నారు.

వాజ్‌పేయ్ తన ముక్కుసూటి నిర్ణయాలతో రాజకీయ దురంధరుడిగా భారత రాజకీయాల్లో ఓ చెరగని ముద్ర వేశారు. రాజనీతిజ్ఞుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న అతికొద్ది మందిలో ఈయనొకరు. సాహితి లోకానికి కవిగా, దాదాపు ఆరేళ్లపాటు భారత దేశానికి ప్రధానిగా, బీజేపీ కీలకనేతగా, అశేష జనాదరణ ఉన్న ప్రముఖుడిగా వాజ్‌పేయ్ గుర్తింపు పొందారు.

 

 

భారత ప్రధానిగా సేవలందించిన అటల్ బిహారీ వాజ్‌పేయి 93 ఏళ్ల వయసులో గతేడాది ఆగస్టు 16న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వాజ్‌పేయి 1996-2004 మధ్య మూడుసార్లు దేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. దాదాపు 47 ఏళ్లపాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగిన వాజపేయి 10 పర్యాయాలు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పోఖ్రాన్ అణు పరీక్ష, కార్గిల్ యుద్ధం, ఢిల్లీ-లాహోర్ బస్సుయాత్ర లాంటి నిర్ణయాలతో ఆయన దేశచరిత్రలో చెరగని ముద్రవేశారు. సుపరిపాలన, ఉన్నతమైన వ్యక్తిత్వంతో వాజ్‌పేయ్ రాజకీయాలకు అతీతంగా అభిమానాన్ని సంపాదించుకున్నారు. బీజేపీనే కాకుండా ఇతర పార్టీల నాయకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ‘రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ అంటూ కమ్యూనిస్టులు సైతం వాజ్‌పేయిని కీర్తించారు.