దేశంతో ఎంతో ఉత్కంఠ ఎదురుచూస్తున్న ఫలితాలు వెలువడుతున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే 4 రాష్ట్రాల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అక్కడ పట్టుకోల్పోవడంతో కాంగ్రెస్ పెద్దలు గందరగోళంలో పడిపోయారు. పంజాబ్ లో ఆప్ ముందుంజలో దూసుకుపోతోంది. ఉత్తరఖండ్‌లో కూడా బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ ఉత్తరాఖండ్ ఇంచార్జ్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీవీతో మాట్లాడుతూ.. బీజేపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు తమ ఓటు ద్వారా సంతృప్తిని, మద్దతును తెలియజేశారన్నారు.
ఉత్తరాఖండ్‌లో మరోసారి వరుసగా రెండవసారి బీజేపీకి ప్రజలు అధికారం అప్పజెప్పి చరిత్ర సృష్టించారని, ఉత్తరాఖండ్ ప్రజలకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఈసారి తక్కువ స్థానాలు రావడం పై సమీక్షిస్తామని, కారణాలు విశ్లేషిస్తామని ఆయన అన్నారు. “డబుల్ ఇంజన్” (రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం) నినాదాన్ని ప్రజలు స్వాగతించారన్నారు. ఫలితాలు అదే విషయాన్ని రుజువుచేశాయని ఆయన వ్యాఖ్యానించారు. పుష్కర్ సింగ్ ధామి ప్రస్తుతం ముఖ్యమంత్రి గా ఉన్నారు. మరలా ఆయనే ముఖ్యమంత్రి. అందులో అనుమానమే లేదని ఆయన స్పష్టం చేశారు.
