దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఢిల్లీ ఓటర్లతో పాటు రాజకీయ నాయకులు ఓటింగ్ లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా పలువురు నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సజావుగా సాగుతున్నది. ఈ క్రమంలో ఉదయం తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఢిల్లీలోని 70 స్థానాలకు మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. పోలింగ్ ప్రశాంతంగా సాగేలా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ఈ నెల 8న అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది.