ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలతో ప్రశాంతంగా సాగిపోతుంది. ఇప్పటి దాకా 42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. మరికొద్దిరోజుల్లో మహా కుంభమేళా ముగియనుంది. ఇక ఈనెల 26న మహా శివరాత్రి కారణంగా అత్యధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ఇందుకు తగినట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తోంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా ఆయా సంస్థలు లేనిపోని తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. అలాంటి సోషల్ మీడియా సంస్థలపై పోలీసులు కొరడా ఝుళిపించారు. తప్పుదారి పట్టించే కంటెంట్‌ను పోస్టు చేసిన 140 సోషల్ మీడియా సంస్థలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు మహా కుంభమేళా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) వైభవ్ కృష్ణ తెలిపారు. ఇక ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పండుగకు అవసరమైన ఏర్పాట్లను పోలీసులు చేశారని తెలిపారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని ప్రగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.