NTV Telugu Site icon

Kerala Boys Prank: ప్రాంక్ పేరుతో వెకిలి చేష్టలు.. బెండు తీసిన పోలీసులు

Kerala Boys Bike Bath

Kerala Boys Bike Bath

Police Filed Case On Two Youngsters Who Bath On Bike While Riding: అసలు ప్రాంక్ అంటే ఏమిటి..? నలుగురిని నొప్పించకుండా, కొంటె పనులు చేస్తూ నవ్వించడం. కానీ, కొందరు మాత్రం ప్రాంక్ పేరిట హద్దుమీరుతున్నారు. పాపులారిటీ కోసం అభ్యంతకరమైన వీడియోలు చేస్తున్నారు. మరికొందరు.. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ, ఏదో తాము గొప్ప పని చేస్తున్నామన్న భావనతో వీడియోలను రిలీజ్ చేస్తుంటారు. ఇలాగే ఇద్దరు యువకులు ఒక పిచ్చి వీడియోని నెట్టింట్లో షేర్ చేశారు. అది పోలీసుల కంట పడటంతో.. వారికి తగిన గుణపాఠం చెప్పారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

కేరళలోని భరణిక్కవు ప్రాంతానికి చెందిన అజ్మల్‌, బాద్‌షా అనే ఇద్దరు యువకులు.. బైక్‌పై స్నానం చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జోరుగా వాన పడుతుండగా.. ఆ ఇద్దరు తమ షర్ట్ విప్పేసి, సోపుతో శరీరం రుద్దుకుంటూ, బైక్‌పై సవారీ చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా.. తామేదో గొప్ప పని చేస్తున్నంత లెవెల్‌లో పోజులిస్తూ, తెగ బిల్డప్పులు ఇచ్చారు. వీరి వెకిలి చేష్టలు చూసి, ‘వీళ్ల ఇంట్లో బాత్రూం లేదా?’ అన్నట్టుగా మొహాలు తేలేశారు. అయితే.. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది అనతి కాలంలోనే వైరల్ అయ్యింది. అర్థనగ్నంగా స్నానం చేస్తూ, బైక్‌పై తిరిగారు కదా.. అందుకే ఇది నెట్టింట్లో హల్‌చల్ సృష్టించింది.

అటు తిరిగి ఇటు తిరిగి ఈ వీడియో పోలీసులు కంట పడటంతో.. వాళ్లు రంగంలోకి దిగారు. ఆ వీడియో ఎవరు అప్‌లోడ్ చేశారన్న వివరాల్ని సేకరించి.. ఆ ఇద్దరు యువకుల్ని పట్టుకొని, కస్టడీలోకి తీసుకున్నారు. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లఘించినందుకు వారిపై కేసు నమోదు చేసి, రూ. 5 వేల జరిమానా విధించారు. ఈ పిచ్చి పని ఎందుకు చేశారని ప్రశ్నిస్తే.. తాము ఈనెల 1న ఓ స్పోర్ట్స్‌ ఈవెంట్‌కు హాజరయ్యామని, తిరిగి వస్తున్న సమయంలో వాన కురవడంతో, సరదా కోసం ఇలా ప్రాంక్ వీడియో చేశామని వివరించారు.