చత్తీస్ ఘడ్ నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అందారి ఐరన్ ఓర్ ప్లాంట్ పై మావోల దాడి చేసి పరిశ్రమకు చెందిన ఆరు వాహనాలను తగులబెట్టారు. అలాగే.. కార్మికులను కూడా కిడ్నాప్ చేస్తుండగా, సమాచారం అందుకొన్న భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నాయి. ఈ క్రమంలో చోటేడోంగ్రీ వద్ద ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల నుండి తప్పించుకున్న మావోయిస్టులు పలువురు కార్మికులను అపహరించి అడవుల్లోకి వెళ్లారు.
read also : రేపు సిరిసిల్ల కు సీఎం కేసీఆర్…షెడ్యూల్ ఇదే
అయితే.. ఈ కాల్పుల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. ఇక అటు కిడ్నాప్ అయిన కార్మికులను రక్షించేందుకు భద్రతా బలగాలు అడవుల్లో కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనతో జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఉన్నతాధికారులు ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. మరోవైపు కిడ్నాప్ కు గురైన కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని క్షేమంగా తీసుకురావాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. వారికేమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.
