Joshimath Sinking: ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణం కుంగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. శనివారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్ లో పర్యటించారు. ప్రమాదం అంచున ఉన్న ఇళ్లలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే 500 పైగా ఇళ్లు, పలు రోడ్లు బీటలువారాయి. ఇదిలా ఉంటే జోషిమఠ్ సంక్షోభంపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉత్తరాఖండ్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు హాజరుకానున్నారు. జోషిమఠ్ పరిస్థితిని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.
Read Also: Shilpa Shetty: ‘ముద్దు’ కేసు కొట్టి వేయండి ప్లీజ్.. కోర్టు మెట్లెక్కిన శిల్ప
పీఎంఓ ఆదివారం మధ్యాహ్నం జోషిమఠ్ పట్టణంలోని పరిణామాల గురించి చర్చించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, క్యాబినెట్ సెక్రటరీ, సీనియర్ ప్రభుత్వ అధికారులు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జోషిమఠ్ జిల్లా అధికారులు, ఉత్తరాఖండ్ సీనియర్ అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం చమోలీ జిల్లాలో సేఫ్టీ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం అదనంగా రూ.11 కోట్లు విడుదల చేసింది.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. జోషిమఠ్ దశాబ్ధం క్రితం భూకంపం వల్ల ఏర్పడిన శిలలపై నిర్మించబడింది. ఈ రాళ్లకు తక్కువ బేరింగ్ కెపాసిటీ ఉంది. దీంతో నిర్మాణాలు ప్రమాదంలో పడ్డాయి. దీనికి తోడు జోషిమఠ్ పట్టణం బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారంగా ఉంది. దీంతో అక్కడ నిర్మాణాలు పెరగడం, రోడ్డు విస్తరణ, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆ ప్రాంతాన్ని అస్థిరంగా మారుస్తున్నాయి. దీనికి తోడు హిమాాలయాల నుంచి వచ్చే నదీ ప్రవాహాలతో అక్కడి నేల కోతకు గురువుతోంది.
