PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మారిషస్ దేశ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఈ పర్యటన జరుగుతుంది. రెండు దేశాలు కూడా అనేక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం, వాణిజ్యం పెంపు, వివిధ రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.
శనివారం జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, కెపాసిటీ బిల్డింగ్, ద్వైపాక్షిక వాణిజ్యం, సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం మరియు చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి రంగాలలో ఇరుపక్షాలు అనేక ఒప్పందాలపై సంతకం చేస్తాయని అన్నారు. మారిషస్‌ని సముద్ర పొరుగు దేశంగా మారిషస్‌ని మిస్రీ అభివర్ణించారు. గత 10 ఏళ్లలో రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయని ఆయన అన్నారు.
మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో భారత రక్షణ దళాలు, భారత నావికా దళానికి చెందిన ఓడ పాల్గొంటాయి. పశ్చిమ హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక మిత్రదేశంగా ఉంది. ఈ దేశ జనాబా 1.2 మిలియన్లు, దీంట్లో 70 శాతం మంది భారత సంతతికి చెందిన వారే. 2005 నుండి, భారతదేశం మారిషస్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉంది. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి, మారిషస్‌కు భారత ఎగుమతులు 462 మిలియన్ డాలర్లు కాగా, భారతదేశానికి మారిషస్ ఎగుమతులు 91.5 మిలియన్ డాలర్లుగా ఉంది. అధికారిక డేటా ప్రకారం, గత 17 సంవత్సరాలలో వాణిజ్యం 132 శాతం పెరిగింది.