RSS: ప్రధాని నరేంద్ర మోడీ రేపు (అక్టోబర్ 1) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగే వేడుకలకు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చరిత్రాత్మక ప్రయాణాన్ని ప్రతిబింబించే స్మారక తపాలా బిళ్ళ మరియు నాణేలు విడుదల చేయనున్నారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఆర్ఎస్ఎస్ చరిత్ర
1925లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్‌ను స్థాపించారు. సాంస్కృతిక అవగాహన, క్రమశిక్షణ, సేవా భావన, జాతీయ వ్యక్తిత్వ నిర్మాణం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు.
దేశానికి చేసిన సేవలు
గత శతాబ్దంలో విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, విపత్తు సహాయ కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ విశేష పాత్ర పోషించింది. వరదలు, భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్వచ్ఛంద సేవకులు సహాయ చర్యల్లో ముందున్నారు. శతాబ్ది ఉత్సవాల్లో ఆర్ఎస్ఎస్ చరిత్రాత్మక విజయాలను మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతికి, జాతీయ ఐక్యతకు అది అందించిన సహకారాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. విజయదశమి రోజున పెద్ద ఎత్తున గణావేష్ ధరించి పద సంచలన్ లో పాల్గొననున్నారు.
