NTV Telugu Site icon

PM Modi: చలామణిలోకి కొత్త నాణేలు.. అదే ప్రత్యేకత!

Pm Launch New Coins

Pm Launch New Coins

2016 నవంబర్ 8న డీమోనిటైజేషన్‌తో కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు కొత్త నాణేల శ్రేణిని ఆవిష్కరించారు. అంధులు సైతం వీటిని సులభంగా గుర్తించేలా రూపొందించారు. ఇదే ఈ నాణేల ప్రత్యేకత! ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను పురస్కరించుకుని ఈ నాణేల ప్రత్యేక సిరీస్‌ను మోదీ విడుదల చేశారు.

రూ. 1, రూ. 2, 5, 10, రూ. 20 డినామినేషన్లలో ఉండే ఈ నాణేలపై ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ (ఏకేఏఎం) డిజైన్‌ ఉంటుంది. ఇవి స్మారక కాయిన్లు కాదని, చెలామణీలో ఉంటాయని ప్రధాని తెలిపారు. అమృత ఘడియల లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పం గురించి నిరంతరం గుర్తు చేసేలా, దేశ అభివృద్ధి కోసం పని చేసేలా ఈ నాణేలు ప్రోత్సహిస్తారని మోదీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మోదీ 12 ప్రభుత్వ పథకాలతో అనుసంధానించిన ‘జన సమ్మర్థ్ పోర్టల్’ను కూడా ప్రారంభించారు. అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరముందని ప్రధాని చెప్పారు. అందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక, కార్పొరేట్ పాలనా పద్ధతుల్ని అనుసరించాలని సూచించారు. ‘మన దేశీ బ్యాంకులు, కరెన్సీని అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంలో కీలక పాత్ర పోషించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి సారించాల్సిన అవసరముంది’ అని మోదీ తెలిపారు.

గత 8 ఏళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణల్ని అమలు చేశామని, డిజిటల్ పేమెంట్స్‌కు రోజురోజుకూ బాగా ఆదరణ పెరుగుతోందన్నారు. ఇప్పటికే భారత్ అనేక ఆర్థిక పరిష్కార వేదికల్ని ఆవిష్కరించిందని, వాటి వినియోగాన్ని పెంచడం కోసం అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహించాలని సూచించారు.

ఇదే సమయంలో ‘జన్‌ సమర్థ్‌’ విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, చిన్న తరహా పరిశ్రమల వ్యాపారవేత్తలకు రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు తోడ్పడుతుంది ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వారి జీవితాలను మెరుగుపర్చడంతో పాటు తమ లక్ష్యాలను సాధించుకోవడంలో తోడ్పడగలదు వెల్లడించారు.