ప్రధాని మోడీ జోర్డాన్‌లో కారులో తిరుగుతూ సందడి చేశారు. జోర్డాన్ యువరాజు ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా II తో కలిసి సందడి చేశారు. యువరాజుతో కలిసి కారులో జోర్డాన్ మ్యూజియంకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీఎండబ్ల్యూ కారు లోపల ముచ్చటించుకుంటూ వెళ్తున్నట్లుగా ఫొటోల్లో కనిపించింది.
జోర్డాన్‌లోని అమ్మాన్‌లోని రాస్ అల్-ఐన్ జిల్లాలో జోర్డాన్ మ్యూజియం ఉంది. దేశంలోనే అతి పెద్ద మ్యూజియం ఇది. అత్యంత ముఖ్యమైన పురావస్తు, చారిత్రక కళాఖండాలు ఉంటాయి. ఈ మ్యూజియాన్ని చూసేందుకు యువరాజుతో మోడీ కారులో వెళ్లారు. యువరాజే స్వయంగా కారు నడిపారు.
ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా II ఎవరు?
క్రౌన్ ప్రిన్స్ అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా II జోర్డాన్ సింహాసనానికి వారసుడు. రాజు అబ్దుల్లా II, క్వీన్ రానియాల పెద్ద కుమారుడు. 1994లో జన్మించాడు. 2009లో యువరాజుగా నియమితులయ్యారు. తర్వాత తరం నాయకుడు ఇతడే. తరచుగా అధికారిక కార్యక్రమాలు, ప్రాంతీయ వేదికలు, అంతర్జాతీయ కార్యక్రమాల్లో జోర్డాన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జోర్డాన్, విదేశాల్లో చదువుకున్నారు. క్రౌన్ ప్రిన్స్ హుస్సేన్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. యూకేలోని రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో సైనిక శిక్షణ కూడా పొందాడు. అంతేకాదు ప్రవక్త మొహమ్మద్ యొక్క 42వ తరానికి ప్రత్యక్ష వారసుడు.
మోడీ జోర్డాన్ పర్యటన
రాజు అబ్దుల్లా II ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ సోమవారం జోర్డాన్ రాజధాని అమ్మాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. జోర్డాన్.. భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని మోడీ పేర్కొన్నారు. ఇక జోర్డాన్ పర్యటన తర్వాత ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు.
On the way to The Jordan Museum with His Royal Highness Crown Prince Al-Hussein bin Abdullah II. pic.twitter.com/CtwcQHkHBZ
— Narendra Modi (@narendramodi) December 16, 2025
