PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!

  • వేదికకు కూతవేటు దూరంలో పేలుడు పదార్థాలు..
  • ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం సమీపంలో జిలెటిన్ స్టిక్స్ లభ్యం
Pm Modi

Pm Modi

PM Modi: బెంగళూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు ముందు కలకలం చోటుచేసుకుంది. ప్రధాని పర్యటించే ప్రాంతానికి సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో భద్రతా సంస్థలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. బెంగళూరు శివార్లలోని కనకపుర రోడ్డులో ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడానికి కొద్ది గంటల ముందు, దీనికి సమీపంలోని ఫుట్‌పాత్‌పై రెండు జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. అసలు ఏం జరిగిందంటే..

ఆదివారం ఉదయం భద్రతా బలగాలు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, కాగలిపుర సమీపంలోని ఒక ఆశ్రమం వద్ద ఫుట్‌పాత్ పక్కన ఈ అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. ఈ పేలుడు పదార్థాలు దొరికిన ప్రాంతం ప్రధాని పాల్గొనే కార్యక్రమ వేదికకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. వెంటనే బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. ఇవి మైనింగ్ కోసం వాడేవా లేక ప్రధాని పర్యటనను లక్ష్యంగా చేసుకున్న కుట్రలో భాగమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో ప్రధాని
భద్రతా పరమైన ఉత్కంఠ నడుమ, ప్రధానమంత్రి తన పర్యటనను కొనసాగించారు. శ్రీ శ్రీ రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఆధ్యాత్మికత, సామాజిక మార్పులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కృషిని ప్రధాని కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని (మెడిటేషన్ హాల్) ప్రధాని ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతూ.. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థను వేరు చేయలేమని ప్రధాని అన్నారు. బెంగళూరు కేవలం టెక్నాలజీ హబ్ మాత్రమే కాదని, భారత ఆధ్యాత్మిక చేతనకు నిలయమని ప్రధాని ప్రశంసించారు.

ప్రధాని పర్యటనకు ముందు బెంగళూరులో పేలుడు పదార్థాలు దొరకడంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని ప్రయాణించే మార్గంలో భద్రతను రెట్టింపు చేశారు. ఈ జిలెటిన్ స్టిక్స్ అక్కడకు ఎలా వచ్చాయనే దానిపై భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేవని అధికారులు స్పష్టం చేశారు.