PM Kisan 24th Installment: దేశవ్యాప్తంగా రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఇప్పటికే 23వ విడత జూన్‌లో విడుదలైన నేపథ్యంలో, తదుపరి 24వ విడత అక్టోబర్‌లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దుర్గా పూజకు ముందే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈసారి కొందరు అర్హులైన రైతులకు రూ.2,000కు బదులుగా రూ.4,000 జమయ్యే అవకాశం ఉంది. గత 23వ విడతలో ఇ-కేవైసీ, భూమి ధృవీకరణ లేదా ఇతర పత్రాల సమస్యల కారణంగా చెల్లింపు ఆలస్యమైన రైతులకు ఈ అవకాశం ఉంటుంది.
ఇలాంటి రైతులు తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని ధృవీకరణ పూర్తి చేసుకున్న తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు వారి పేర్లను ఆమోదం కోసం పంపుతాయి. పేర్లు ఆమోదం పొందితే గత 23వ విడతకు సంబంధించిన బకాయి రూ.2,000తో పాటు 24వ విడత రూ.2,000 కలిపి మొత్తం రూ.4,000 అందే అవకాశం ఉంది. అయితే 23వ విడతను ఇప్పటికే సకాలంలో పొందిన రైతులందరికీ రూ.4,000 రాదు. వారికి 24వ విడత కింద సాధారణంగా రూ.2,000 మాత్రమే లభిస్తుంది. బకాయి విడతలు ఉన్న రైతులు ఇ-కేవైసీ, ల్యాండ్ సీడింగ్ ప్రక్రియలను పూర్తి చేసుకోవడం ద్వారా తదుపరి విడతతో పాటు పెండింగ్ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.
పీఎం కిసాన్ విడత స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
రైతులు తమ విడత, అర్హత, ఇ-కేవైసీ స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా అధికారిక పీఎం కిసాన్ పోర్టల్‌ను సందర్శించాలి. హోమ్‌పేజీలోని ‘Farmers Corner’ విభాగంలో ‘Know Your Status’పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి. అనంతరం మీ విడత చెల్లింపు, ఇ-కేవైసీ తదితర వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

