PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Pm Modi

Pm Modi

PM Kisan Samman Nidhi 24th Installment 2026: దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పథకం 24వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో భిల్డీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేశారు. ఈ విడతలో 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున అందించారు. మొత్తంగా రూ.18,680 కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లోకి బదిలీ అయినట్లు పేర్కొన్నారు. దీపావళికి ముందే 24వ విడత విడుదల కావడంతో రైతులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో, ఒక్కో విడతకు రూ.2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ అవసరాలకు కొంత ఆర్థిక సహాయం పొందవచ్చు. అయితే ప్రతి విడత నిధులు పొందాలంటే రైతుల వివరాలు, అర్హతలు, అవసరమైన రికార్డులు సక్రమంగా ఉండాలి.

పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు వచ్చాయో లేదో ఎలా చెక్ చేయాలి?

మీ బ్యాంకు ఖాతాలో రూ.2,000 జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

స్టేటస్ చెక్ చేసే విధానం:

ముందుగా pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
హోమ్‌పేజీలో ఉన్న ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.
స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
మీ మొబైల్‌కు వచ్చే OTPని నమోదు చేసి సబ్మిట్ చేయండి.
అనంతరం మీ పీఎం కిసాన్ దరఖాస్తు, విడతల చెల్లింపు వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఈ వివరాల ద్వారా 24వ విడత చెల్లింపు స్టేటస్ ని తెలుసుకోవచ్చు.