NTV Telugu Site icon

Gyanvapi Case: శివలింగం, విరిగిన దేవతా విగ్రహాలు, తెలుగు శాసనాలు.. జ్ఞానవాపి మసీదు ఏఎస్ఐ సర్వేలో కీలక విషయాలు..

Gyanvapi Mosque

Gyanvapi Mosque

Gyanvapi Case: వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే సంచలనంగా మారింది. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ రిపోర్టును బహిరంగపరచడం జరిగింది. ఇప్పటికే రెండు వర్గాలకు ఈ రిపోర్టు అందింది. నిన్న హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ రిపోర్టులోని అంశాలను మీడియాకు వెళ్లడిస్తూ.. అక్కడి మసీదుకు పూర్వం పెద్ద హిందూ ఆలయం ఉండేదని ఏఎస్ఐ రిపోర్టు సూచిస్తుందని వెల్లడించారు.

తాజాగా రిపోర్టులో మసీదులో లోపల హనుమాన్, గణేషుడు, నంది వంటి హిందూ దేవతల విరిగిన విగ్రహాలను చూపించే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శివలింగం ఆకారాన్ని మసీదులో గుర్తించారు. పాలరాయితో చేసిన హనుమాన్ విగ్రహం ఉందని ఏఎస్ఐ తన రిపోర్టులో పేర్కొంది. టెర్రకోటతో చేసిన గణేశుడి శిల్పం ఉందని అందుకు సంబంధించిన ఫోటోలను రిపోర్టులో పేర్కొంది.

తెలుగు, కన్నడ శాసనాలు లభ్యం:

అంతకుముందు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ.. మసీదుకు పూర్వం ఇక్కడ 5000 ఏళ్ల నాటి పురాతన హిందూ ఆలయం ఉండేదని, హిందూ దేవీదేవతల విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయని, తెలుగు, కన్నడలో శాసనాలు లభ్యమయ్యాయని తెలిపారు. మసీదు నిర్మించేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు స్పష్టంగా నిర్ధారణ అవుతోందని, 17వ శతాబ్ధంలో ఔరంగజేబు ఆదివిశ్వర ఆలయాన్ని కూల్చివేసే సమయంలో ఇక్కడ గొప్ప ఆలయం ఉండేదని ఆధారాలు సూచిస్తున్నాయని పేర్కొన్నాడు.

గతంలో దేవాలయం స్తంభాలను మసీదు నిర్మాణంలో ఉపయోగించారని, ఆలయానికి మధ్యలో పెద్ద గది, ఉత్తరం, ఆగ్నేయం, పడమర వైపు కనీసం ఒక గది ఉందని, ఉత్తరం, దక్షిణం, పశ్చిమాన మూడు గదుల అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయని, తూర్పున ఉన్న గది అవశేషాలు, పొడవును భౌతికంగా నిర్ధారించలేదని, ఆ ప్రాంతం రాతి ఫ్లోరింగ్‌తో కప్పబడి ఉందని ఏఎస్ఐ తన నివేదికలో పేర్కొంది. కారిడార్‌లోని స్తంభాలు, పైలస్టర్ అధ్యయనం అవి మొదట హిందూ దేవాలయంలో భాగమని సూచిస్తున్నాయని ఏఎస్ఐ తన నివేదికలోని పేజీ 134లో పేర్కొంది. ASIకి సీనియర్ లీగల్ కన్సల్టెంట్‌గా ఉన్న డాక్టర్ సుభాష్ సి గుప్తా, ఈ నివేదికలు వివరణాత్మక శాస్త్రీయ అధ్యయనం తర్వాత సమర్పించబడ్డాయి మరియు కీలకమైన సాక్ష్యంగా ఉన్నాయని సూచించారు. ఈ నివేదికను అంగీకరించడం, అంగీకరించకపోవడం న్యాయమూర్తి విచక్షణ అని అన్నారు.

మసీదు కమిటీ వాదన:

మసీదు నిర్వహన కమిటీ, అంజుమాన్ ఇంతెజామియా మసీదు(ఏఐఎం) ఏఎస్ఐ సర్వేపై ప్రశ్నల్ని లేవనెత్తింది. దాని ప్రతిష్ట కోసం ఈ నివేదిక ఇచ్చిందని ఆరోపించింది. ఇది నివేదిక మాత్రమే అని నిర్ణయం కాదని అన్నారు. ఈ నివేదిక అధ్యయనం, విశ్లేషనకు సమయం పడుతుందని, నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు.

ఈ మసీదు 804-42 హిజ్రీ సమయంలో జౌన్‌పూర్‌కు చెందిన గొప్ప ముక్తాకి హెజ్ గర్ ముస్లించే నిర్మించబడింది. అక్బర్ చక్రవర్తి పాలనకు ముందు సుమారు 150 సంవత్సరాలుగా ముస్లింలు నమాజ్ చేస్తున్నారని చెప్పారు. మసీదును రక్షించుకోవడం మా బాధ్యత అని, ముస్లింలు శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేసింది.