CBI: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వద్ద పెండింగ్‌లో 7,072 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తాజాగా విడుదలైన కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 31, 2023 నాటికి ఈ కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 379 హైప్రొఫైల్ కేసులు ఉన్నట్లుగా చెప్పింది. ఇవి 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో 1,056 కేసులు దర్యాప్తు దశలో ఉండగా, మిగతా 6,016 కేసులు వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. ఈ నివేదికను సీబీఐ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) సమర్పించింది.
Read Also: Nenu Ready: హవీష్, నక్కిన ‘నేను రెడీ’ షూట్ మొదలు!
2019లో 6,639 కేసులు పెండింగ్‌లో ఉండగా, 2020కి ఇవి 6,943కి పెరిగాయి. అయితే, 2021లో ఈ కేసుల సంఖ్య 6,882కి తగ్గాయి. మళ్లీ 2022లో 6,991కి చేరాయి. 2023లో ఇప్పటి వరకు అత్యధికంగా 7,072 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2023లో మొత్తం 392 కేసుల విచారణ పూర్తయింది. ఇందుల్లో 238 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. ఇది 71.47 శిక్షల శాతం. 2022లో 806 కేసుల విచారణ పూర్తయ్యి, 447 శిక్షలు విధింపబడ్డాయి. అంటే 69.17 శాతం. 2023లో సీబీఐ 154 రెగ్యులర్ కేసులను, 77 ప్రిలిమినరీ ఎంక్వైరీలను నమోదు చేసింది.
దేశవ్యాప్తంగా సీబీఐకి ప్రత్యేకంగా 92 కోర్టులు ఉన్నాయి. వీటిలో 34 కోర్టులు ఒక్క సంవత్సరంలో 1,000కు పైగా కేసులను పరిష్కరించగా, 15 కోర్టులు 2,000కు పైగా కేసులను పరిష్కరించాయి. సీబీఐలో ప్రస్తుతం 1,286 మంది అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం మంజూరైన పోస్టులు 1,684 కాగా, 398 పోస్టులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి.
2023 చివరికి పెండింగ్ దర్యాప్తు కేసుల స్థితి:
1 ఏడాదిలోపు: 807
1–2 సంవత్సరాలు: 1,118
2–3 సంవత్సరాలు: 1,016
3–5 సంవత్సరాలు: 1,221
5–10 సంవత్సరాలు: 1,297
10 సంవత్సరాలకుపైగా: 913
