Site icon NTV Telugu

Parliament Monsoon Session: భారత్ నిజమైన స్నేహితుడిని కోల్పోయింది.. షింజో అబేకు పార్లమెంట్ సంతాపం

Parliament Tribute To Shinzo Abe

Parliament Tribute To Shinzo Abe

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ, లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇవాళ ఆయా సభల్లో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాగానే, ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. రాజ్యసభలోనూ అబే మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నిక దృష్ట్యా లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. విపక్షాల ఆందోళనల నడుమ పెద్దల సభను రాజ్యసభ ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.

“జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే ఇటీవల మరణించారని నేను హృదయపూర్వక విచారంతో తెలియజేస్తున్నాను. సభ దాని పట్ల హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది. జూలై 8, 2022న ఆయన కన్నుమూశారు. షింజో అబే జపాన్ ప్రధానిగా అత్యధిక కాలం పనిచేశారు. భారతదేశానికి ప్రయోజనకరమైన వివిధ ప్రయోజనాలకు అబే మద్దతు ఇచ్చాడు. అతను ఆసియాలోని రెండు ప్రముఖ ప్రజాస్వామ్య దేశాలైన భారతదేశం, జపాన్‌లను ‘స్నేహితులు’గా భావించాడు. ఈ కారణంగా, అతని పాలనలో భారతదేశం, జపాన్ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి.” అని లోక్‌సభ స్పీకర్ బిర్లా అన్నారు. జపాన్ ఒక దార్శనిక నాయకుడిని కోల్పోయిందని లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా అబే గొప్పతనాన్ని తెలిపారు. మరోవైపు, భారతదేశం నిజమైన స్నేహితుడిని కోల్పోయిందన్నారు. . అబే మరణంపై సభ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుందని.. ఆయన ఆత్మకు దేవుడు శాంతిని కలుగజేయాలని ఆకాంక్షించారు.

Parliament monsoon session 2022: తొలిరోజే సభకు అంతరాయం.. రాజ్యసభ రేపటికి వాయిదా

జపాన్ మాజీ ప్రధాని అబే జూలై 8న ఆ దేశంలోని పశ్చిమ ప్రాంతంలోని నారాలో ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించారు. రెండు సార్లు కాల్పులు జరగగా స్టేజీపైనే కుప్పకూలిపోయారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉండగా.. ఈ రోజు ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఈ కాలంలోనే రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సెషన్ కీలకమైంది. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికలు, ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్నాయి.కుటుంబ న్యాయస్థానాల (సవరణ) బిల్లు, అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లుతో సహా వివిధ బిల్లులు ఈ సెషన్‌లో తీసుకోబడతాయి.

Exit mobile version