Parliament Panel: వలసవాద కాలం నాటి క్రిమినల్ చట్టాల సవరణలో భాగంగా వ్యభిచారం, స్వలింగ సంపర్కాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారతీయ శిక్షాస్మృతి- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు భారతీయ సాక్ష్యాధారాల చట్టం – భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, మరియు భారతీయ సాక్ష్యా అధినియం వంటి మూడు బిల్లులను ఈ ప్యానెల్ అధ్యయనం చేస్తోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులను మూడు నెలల గడువుతో ఆగస్టు నెలలో తదుపరి పరిశీలన కోసం బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి పంపారు. శుక్రవారం సమావేశమైన కమిటి, ప్రతిపక్ష సభ్యుల మరో మూడు నెలలు పొడగించాలని కోరడంతో ముసాయిదా రిపోర్టును ఆమోదించలేదు. తదుపరి సమావేశం నవంబర్ 6న జరగనుంది.
Read Also: CM YS Jagan: పురపాలక, పట్టణాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
2018లో వ్యభిచారంపై సుప్రీంకోర్టు కొట్టేసిన చట్టాన్ని పునరుద్ధరించడం లేదా కొత్త చట్టాన్ని ఆమోదించడం ద్వారా వ్యభిచారాన్ని మళ్లీ క్రిమినల్ నేరంగా పరిగణించాలని డ్రాఫ్ట్ రిపోర్ట్ సిఫార్సు చేస్తుందని భావిస్తున్నారు. 2018లో ఐదుగురు సభ్యుల బెంచ్ వ్యభిచారం నేరం కాదు, కాకూడదని తీర్పు ఇచ్చింది. ఇది సివిల్ నేరానికి, విడాకులకు కారణమవుతుంది అని అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అన్నారు. భార్యకు యజమాని భర్త అనే భావనను అనుసరించి వాదనలు జరిగాయి.
భర్త అనుమతి లేకుండా వివాహితతో ఓ వ్యక్తి సంబంధం పెట్టుకుంటే, నేరం రుజువైతే సదరు వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష ఉంటుందని చట్టం చెబుతోంది. అయితే స్త్రీకి శిక్ష పడదు. కాగా వ్యభిచారంపై కొట్టివేయబడిని నిబంధనలను తిరిగి తీసుకువస్తే లింగ తటస్థంగా ఉండాలని నివేదిక సిఫారసు చేసే అవకాశం ఉంది. అంటే స్త్రీ, పురుషులు ఇద్దరు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివాహ వ్యవస్థను రక్షించడం కోసం ఐపీసీ 497 లింగ తటస్థంగా తీసుకువచ్చే అవకాశం ఉంది.
సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే బ్రిటిష్ కాలం నాటి నిబంధనలను ఐదేళ్ల క్రితం సుప్రీంకోర్టు కొట్టేసింది. ఐపీసీ సెక్షన్ 377,497 రెండింటిని క్రిమినలైజ్ చేయడాన్ని కమిటీ సిఫారసు చేస్తుందని భావిస్తున్నారు. రాజ్యాంగంలోని 14, 15, 19, 21 అధికరణలను ఈ సెక్షన్లు ఉల్లంఘించినట్లు కోర్టు గుర్తించినప్పటీకీ.. పెద్దల్లో, మైనర్లలో ఏకాభిప్రాయం లేని శరీర సంభోగం సందర్బాల్లో సెక్షన్ 377లోని నిబంధనలు వర్తిస్తాయి.