Monsoon Session of Parliament: సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నేడు పార్లమెంట్ లో అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. అన్ని పార్టీల నుంచి వారి ప్రతినిధులు హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే, జైరాం రమేశ్, రాష్ట్రీయ లోక్‌దళ్ ఎంపీ జయంత్ చౌదరి, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ అన్నాడీఎంకే ఎంపీ డాక్టర్ ఎం తంబి దురై, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, అప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేల్ మొదలైనవారు హాజరయ్యారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ సమావేశానికి హజరయ్యారు.
Read Also: Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. రేపు అఖిలపక్ష భేటీ
జూలై 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12న ముగుస్తాయి. ఈ సారి సమావేశాలు వాడీవేడీగా జరగబోతున్నాయి. ద్రవ్యోల్భనం, దేశ ఆర్థిక వ్యవస్థ, చైనా సమస్య, మహారాష్ట్ర రాజకీయాలు, అగ్నిపథ్ పథకం, నిరుద్యోగంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసే అవకాశం కనిపిస్తోంది. అన్ని విపక్షాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ సమావేశాలను వేదికగా చేసుకోనున్నాయి. ప్రతిపక్షాలకు ధీటుగానే సమాధానం ఇచ్చేందుకు అధికార పక్షం కూడా సమాయత్తం అవుతోంది.
ఈ సమావేశాల్లో కేంద్రం మొత్తం 24 బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో కంటోన్మెంట్ బిల్లు, యాంటీ ట్రాఫికింగ్ బిల్లు, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లులతో పాటు మొత్తం 24 బిల్లులు ఉన్నాయి. కాఫీ(ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్) బిల్లు, ఎంటర్‌ప్రైజెస్ అండ్ సర్వీసెస్ హబ్ అభివృద్ధి బిల్లు, రిజిస్ట్రేషన్ అండ్ రక్షణ సవరణ బిల్లు, గిడ్డంగుల (అభివృద్ధి మరియు నియంత్రణ) (సవరణ) బిల్లు ఉన్నాయి.