అన్నాడీఎంకేలో జయలలిత మరణం తర్వాత వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు బలమైన నేతలుగా ముద్రపడ్డ పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారే నంబర్‌వన్ అవ్వాలన్న కాంక్ష వీరి మధ్య దూరాన్ని పెంచింది. తాజాగా అదును చూసి పన్నీర్ సెల్వంను పళనిస్వామి దెబ్బకొట్టారు. సోమవారం జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికయ్యారు. మరోవైపు పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అన్నాడీఎంకే తీర్మానం ప్రవేశపెట్టింది. పార్టీలో ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ప్రధాన పదవులను కూడా తొలగించింది. పన్నీర్ సెల్వం మద్దతుదారులైన వైతిలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకరన్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేసింది.
Read Also:Supreme Court: విజయ్ మాల్యాకు బిగ్ షాక్.. కోర్టు ధిక్కార కేసులో నాలుగు నెలల జైలుశిక్ష
ఇప్పటివరకు పార్టీ ట్రెజరర్‌గా ఉన్న పన్నీర్ సెల్వం స్థానంలో దిండుగల్ శ్రీనివాసన్ ను పళనిస్వామి నియమించారు. సీనియర్ నేతలు పలు మార్లు పన్నీర్ సెల్వంతో ఏక నాయకత్వంపై చర్చలు నిర్వహించినా ఆయన అంగీకరించలేదని పళనిస్వామి ప్రకటించారు. అంతకుముందు చెన్నైలోని జయలలిత కట్టించిన పార్టీ కార్యాలయంలోనే పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు బాహాబాహీకి దిగడం తమిళనాడు రాజకీయాల్లో కలకలం సృష్టించింది. పన్నీర్ సెల్వం మద్దతుదారులు చెప్పులతో పళనిస్వామి ఫొటోలను కొట్టడం కనిపించింది. అ టు పన్నీర్ సెల్వం దిష్టి బొమ్మలను పళనిస్వామి మద్దతు దారులు దహనం చేశారు. దీంతో అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.
కాగా తనను పార్టీ నుంచి తొలగించడంపై పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ఈపీఎస్ సొంతం కాదని ఆయన ఆరోపించారు. తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. అన్నాడీఎంకే పార్టీకి తానే కోశాధికారిని అని.. తానే ఈపీఎస్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
