Site icon NTV Telugu

ONGC: అరేబియా సముద్రంపై హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..

Ongc Chopper Emergency Landing

Ongc Chopper Emergency Landing

ముంబయిలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ)కి చెందిన హెలికాప్టర్ ఒకటి అరేబియా సముద్రంపై అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులో మొత్తం 9 మంది ఉండగా.. ఇప్పటివరకు ఆరుగురిని రక్షించారు. మిగతా వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.

ఓఎన్‌జీసీకి చెందిన ఆరుగురు సిబ్బంది, కాంట్రాక్టర్, ఇద్దరు పైలట్లతో వెళుతున్న హెలికాప్టర్ ఓఎన్‌జీసీకి చెందిన రిగ్ సాగర్ కిరణ్ సమీపంలో మంగళవారం నాడు అత్యవసరంగా ల్యాండింగ్ అయిందని కంపెనీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. హెలికాప్టర్‌కు ఫ్లోటర్ల సాయంతో సముద్రంపై ల్యాండ్ అయినట్లు తెలిపింది. సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. భారత తీర రక్షక దళం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు నౌకలను సైట్ వైపు మళ్లించింది. హెలికాప్టర్‌ ఎందుకు ల్యాండ్ అయిందో ఇంతవరకు స్పష్టత రాలేదు.

డామన్ నుండి బయలుదేరిన ఒక డోర్నియర్ విమానం వారిని రక్షించేందుకు ఆ ప్రాంతంలో ఒక లైఫ్ తెప్పను పడవేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం ముంబైకి అరేబియా సముద్రంలో 7 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. సముద్రంలో ఉన్న నిల్వల నుంచి చమురు, గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు ఓఎన్‌జీసీ అనేక రిగ్‌లను ఏర్పాటు చేసింది.

Exit mobile version