Site icon NTV Telugu

Uttarakhand: 5 ఆస్పత్రుల నిర్లక్ష్యం.. ఏడాది బాలుడు మృతి.. ముఖ్యమంత్రి ఆగ్రహం

Uttarakhand

Uttarakhand

ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏడాది బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దర్యాప్తునకు ఆదేశించారు.

ఆర్మీ అధికారి దినేష్ చంద్ర జోషి కుమారుడు శివాంష్ జోషి డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నాడు. ఉత్తరాఖండ్‌లోని నాలుగు జిల్లాల్లోని ఐదు ఆస్పత్రులకు రిఫర్ చేశారు. ఇలా ఐదు ఆస్పత్రులకు 180 కి.మీ ప్రయాణం చేశారు. కానీ చివరికి శివాంష్ జోషి చనిపోయాడు. సకాలంలో వైద్య సహాయం లేకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ చనిపోయాడని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే ఏడాది బాలుడు చనిపోవడం పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన దురదృష్టకరం అన్నారు. దీంతో దర్యాప్తునకు ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Banjara Hills: పబ్ లో ఎంజాయ్ చేద్దాం రమ్మని పిలిచి.. యువకుడి కిడ్నాప్

జూలై 10న శివాంష్ జోషికి వాంతులు కావడంతో తల్లిపాలు ఇవ్వడం సాధ్యం కాలేదు. దీంతో చిన్నారి డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి 22 కి.మీ దూరంలో ఉన్న మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లాక అక్కడ కూడా పిల్లలకు సంబంధించిన సౌకర్యాలు లేవు. అక్కడ నుంచి మరో 20 కి.మీ దూరంలో ఉన్న బాగేశ్వర్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర వార్డులో డ్యూటీలో ఉన్న వైద్యుడు మొబైల్ ఫోన్‌లో బిజీగా ఉన్నాడని బాలుడి తండ్రి ఆరోపించారు. నర్సులు కూడా జోకులు, నవ్వులతో బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. డాక్టర్ గానీ ఇతర సిబ్బంది మర్యాదగా మాట్లాడలేదన్నారు. వైద్యులు చూడకపోగా అల్మోరాకు రిఫర్ చేశారని తండ్రి వాపోయాడు. తీరా అక్కడికి వెళ్లాక బిడ్డ మెదడులో రక్త ప్రవాహ అవరోధంతో బాధపడుతున్నాడని పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్ లేకపోవడంతో వైద్యుడు ఉన్నత కేంద్రానికి వెళ్లాలని సూచించాడు. చిన్నారి రాత్రి 7 గంటలకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో చిన్నారి తల్లి జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫోన్ చేసి సహాయం కోరిన తర్వాత రెండున్నర గంటలు ఆలస్యంగా వాహనం వచ్చింది.

ఇది కూడా చదవండి: AP Aqua Farming: ట్రంప్ ఎఫెక్ట్‌.. ఆక్వా రంగంపై పిడుగు..!

చివరికి రాత్రి 9:30 గంటలకు నాల్గో ఆసుపత్రి అయిన అల్మోరా మెడికల్ కాలేజీకి తరలించారు. చిన్నారికి చికిత్స అందించారు కానీ మళ్లీ నైనిటాల్‌లోని హల్ద్వానీలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. జూలై 12న హల్ద్వానీలో వైద్యులు బిడ్డను వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే నాలుగు రోజుల తర్వాత జూలై 16న బాలుడు చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయాడని వాపోయారు. దీంతో ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.

Exit mobile version