Site icon NTV Telugu

One Nation-One Examination: ఒకే దేశం-ఒకే పరీక్ష. నీట్, జేఈఈని కలిపి సీయూఈటీని నిర్వహించనున్న యూజీసీ

One Nation One Examination

One Nation One Examination

One Nation-One Examination: ఒన్‌ నేషన్‌-ఒన్‌ రేషన్‌, ఒకే ర్యాంక్‌-ఒకే పెన్షన్‌ మాదిరిగా ఇప్పుడు ఒన్‌ నేషన్-ఒన్‌ ఎగ్జామినేషన్ అనే అంశం తెర మీదికి వచ్చింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కసరత్తు ప్రారంభించింది. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలను కలిపి కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌-అండర్‌ గ్రాడ్యుయేట్‌ (సీయూఈటీ-యూజీ) నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని యూజీసీ చైర్‌పర్సన్‌ ఎం.జగదేశ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు.

ఒకే సబ్జెక్టుల మీద వేర్వేరు పరీక్షలను కండక్ట్‌ చేయటం ఎందుకని ఆయన అంటున్నారు. ప్రస్తుతం మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ.. ఈ నాలుగు సబ్జెక్టులతో మూడు ఎంట్రన్స్‌ టెస్టులు రాయాల్సి వస్తోందని, ఇకపై అలాంటి అవసరం ఉండదని అన్నారు. ఇప్పుడు.. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ-మెయిన్‌), మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) రాస్తున్నారు. తాజాగా సీయూఈటీ-యూజీకి సైతం హాజరవుతున్నారు. ఈ మూడు పరీక్షలను మొత్తమ్మీద 43 లక్షల మంది అటెంప్ట్‌ చేస్తున్నారు.

RBI Update: ఆర్బీఐలోకి ఆ నలుగురు మళ్లీ

మెజారిటీ విద్యార్థులు మూడు రాయకపోయినా కనీసం రెండింటికైనా అటెండ్‌ అవుతున్నారు. జేఈఈ-మెయిన్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. నీట్‌-యూజీలో మ్యాథ్స్‌కి బదులు బయాలజీ ప్రశ్నలు వస్తున్నాయి. మిగతా రెండు సబ్జెక్టులు సేమ్‌. సీయూఈటీ-యూజీలోని మొత్తం 61 డొమైన్‌ సబ్జెక్టుల్లో ఈ నాలుగూ ఉండటం గమనార్హం. అందువల్ల జేఈఈని, నీట్‌ని కలిపి ఒకే పరీక్ష(సీయూఈటీ-యూజీ)గా నిర్వహించాలని యూజీసీ భావిస్తోంది.

ఈ మేరకు దేశవ్యాప్తంగా చర్చా కార్యక్రమాలను చేపట్టి, వివిధ వర్గాల అభిప్రాయలను సేకరించి, ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేస్తోంది. సింగిల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాసినప్పటికీ ఎవరికి నచ్చిన కోర్సుల్లో వాళ్లు ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తామని యూజీసీ చైర్‌పర్సన్‌ జగదేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. దీంతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వ్యయప్రయాసలు, మానసిక ఒత్తిళ్లు, పరీక్షల భయాలు తొలిగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సీయూఈటీ-యూజీని ఏడాదికి రెండు సార్లు రాసే ఛాన్స్‌ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. బోర్డ్‌ ఎగ్జామ్స్‌ అయ్యాక ఒకసారి, డిసెంబర్‌లో మరోసారి పరీక్ష పెడతామని వివరించారు. ఇప్పటికే ప్రారంభమైన సీయూఈటీ-యూజీలో ఎదురవుతున్న సాధకబాధకాలను అధిగమించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రశాంతంగా ఒకే ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్లు జరుగుతాయని యూజీసీ చైర్‌పర్సన్‌ జగదేశ్‌ కుమార్‌ తెలిపారు.

Exit mobile version