NTV Telugu Site icon

O Panneerselvam: త్వరలో బీజేపీలోకి ఓపీఎస్..

Ops

Ops

O Panneerselvam Joining BJP: తమిళనాడు రాజకీయాలు కీలక చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల అన్నాడీఎంకే పార్టీలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. పార్టీపై పట్టు సాధించే ప్రయత్నంలో ఇరు వర్గాలు పోటాపోటీగా కోర్టు కేసులు పెట్టుకున్నాయి. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తీవ్ర పోరాటం జరిగింది. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వంలో పాటు అతని అనుచరులను ఏఐఏడీఎంకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ప్రస్తుతం పన్నీర్ సెల్వం ఏ పార్టీలో చేరుతారనే చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా పన్నీర్ సెల్వం బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు తమిళనాడులో జోరుగా సాగుతున్నాయి. శుక్రవారం ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించారు. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం, ప్రధాని మోదీతో ఎయిర్ పోర్టులో సమావేశం అయ్యారు. దీంతో రానున్న రోజుల్లో పన్నీర్ సెల్వం బీజేపీలో చేరుతారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ, తన ఆరోగ్యంపై ఆరా తీశారని పన్నీర్ సెల్వం చెప్పారు. ప్రధాని తమిళనాడు పర్యటనలో ఆయన్ను కలిసేందుకు ఇటు పన్నీర్ సెల్వం, అటు పళని స్వామి ఇద్దరు సమయం కోరారు.

Read Also: IND vs WI 1st T20I: తొలి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం

ఇదిలా ఉంటే తమిళనాడులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవం కోసం ప్రధాని చెన్నైకి వచ్చిన తరుణంలో మోదీ, అమిత్ షాతో కలిసి పన్నీర్ సెల్వం ఉన్న భారీ హోర్డింగ్ ను ఏర్పాటు చేయడంతో త్వరలోనే పన్నీర్ సెల్వం బీజేపీలో చేరుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. బీజేపీలో చేరేందుకు పన్నీర్ సెల్వం ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహాయంతో అన్నాడీఎంకేలోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో పన్నీర్ సెల్వం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.