Site icon NTV Telugu

Non-bailable warrant against Nithyananda: నిత్యానందపై నాన్ బెయిలబుల్ వారెంట్..

Nithyananda

Nithyananda

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిజీపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది కోర్టు.. నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే కాగా.. ఆయన మాజీ డ్రైవర్‌ లెనిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ సాగుతోంది.. అయితే, ఈ కేసులో నిత్యానంద 2019 నుంచి విచారణకు రాకపోవడంతో బెంగళూరులోని రామనగర అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు .. ఇప్పుడు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వచ్చే నెల 23లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.. గతంలోనే అతనిపై ఓపెన్-ఎండ్ వారెంట్ కూడా జారీ చేయబడింది, అయితే, పోలీసులు నిత్యానంద ఆచూకీ కనిపెట్టలేకపోయారు.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు సాక్షులను విచారించారు, నిందితుడిగా ఉన్న నిత్యానంద లేకపోవడంతో గత మూడేళ్లుగా విచారణ నిలిచిపోయింది.

Read Also: Reliance Jio plans: కొత్త ప్లాన్స్‌ తెచ్చిన జియో.. రోజుకి 2 జీబీ డేటా, ఓటీటీ ఆఫర్లు సహా మరిన్ని..!

నిత్యానందపై అత్యాచారం కేసు అతని మాజీ డ్రైవర్ లెనిన్ ఫిర్యాదు ఆధారంగా 2010లో నమోదు చేయబడింది.. అంతేకాదు నిత్యానందను అరెస్ట్‌ చేయడం.. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల కావడం జరిగిపోయాయి.. అయితే, 2020లో నిత్యానంద దేశం నుంచి పారిపోయాడంటూ లెనిన్‌ చేసిన పిటిషన్‌పై మళ్లీ బెయిల్‌ను రద్దు చేసింది కోర్టు.. కాగా, దేశం విడిచి వెళ్లిపోయిన నిత్యానంద.. కైలాసం అని పిలిచే ప్రదేశంలో తన ఆశ్రమాన్ని స్థాపించినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ స్థలం ఎక్కడుందనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి.. దానికే కైలాసం అని పేరు పెట్టి.. ఓ దేశంగా ప్రకటించేకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని.. ప్రత్యేక ఎయిర్‌పోర్ట్‌, ప్రత్యేక కరెన్సీ.. ఇలా అనేక ప్రచారాలు జరిగాయి.. అయితే, ఆయన తమ దేశంలో లేరని ఈక్వెడార్‌ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు.. నిత్యానంద రహస్య ప్రాంతం నుంచి మాట్లాడిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి.. మొత్తంగా కోర్టుకు హాజరు కావాలంటూ అనేకసార్లు సమన్లు పంపినా సమాధానం రాకపోవడంతో.. ఇప్పుడు కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. మరి.. తన కైలాసం నుంచి నిత్యానంద వచ్చేనా? అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version