ముడా భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఊరట లభించింది. ముడా భూ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రిని ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. దీంతో సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సిద్ధరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు సోమవారం ట్రయల్ కోర్టును ఆదేశించింది. హైకోర్టులో తదుపరి విచారణ జరిగే వరకు… అనగా ఆగస్టు 29 వరకు ముఖ్యమంత్రికి మధ్యంతర ఉపశమనం అమలులో ఉంటుంది.
ముడా భూ కుంభకోణం కేసులో తనను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడాన్ని తప్పుపడుతూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ చర్య చట్ట విరుద్ధమని.. అంతేకాకుండా ఇది తీవ్రచర్య అని పిటిషన్‌లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరిపాలనకు అంతరాయం కలిగించడం.. అలాగే రాజకీయ అస్థిరత సృష్టించేందుకు గవర్నర్ ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని విచారించిన న్యాయస్థానం.. తదుపరి విచారణ తేదీ వరకు సంబంధిత ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా సిద్ధరామయ్య తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. కర్ణాటకలో సక్రమంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్ ఈ చర్యలకు పాల్పడ్డారని వాదించారు. ముఖ్యమంత్రిపై అభియోగాలు మోపిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ను వర్తింపజేయడానికి రెండు షరతులు లేవని ఆయన వాదించారు.
ఇదిలా ఉంటే.. బెంగళూరు చిత్రకళా పరిషత్‌లో ఫొటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ముడా కేసులో న్యాయం జరుగుతుందని తన మనసాక్షికి తెలుసు అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని.. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నట్టు చెప్పారు. ఒక్క మచ్చ కూడా లేదని చెప్పారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని.. తానే ఏ తప్పు చేయలేదని రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అని చెప్పుకొచ్చారు. రాజ్‌భవన్‌ను ఉపయోగించుకుని బీజేపీ, జేడీఎస్, కేంద్ర ప్రభుత్వం తనపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొంటామని స్వష్టం చేశారు. తనను రాజకీయంగా అంతం చేయగలమనేది వారి భ్రమ అని ఎద్దేవా చేశారు. తాను పేదలకు అండగా ఉంటూ… ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుండటం… ప్రతిపక్షాన్ని కలవరపెడుతోందన్నారు. సిద్దరామయ్యను రాజకీయంగా అంతమొందిస్తే కాంగ్రెస్ పార్టీని అంతమొందించవచ్చనే భ్రమలో ప్రతిపక్షాలు ఉన్నాయని సిద్ధరామయ్య విమర్శించారు.
