Newborn girl: తమిళనాడులో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని మైలాడుతురై బస్టాండ్‌లోని పబ్లిక్ టాయిలెట్‌లో నవజాత శిశువు దొరికింది. కొన్ని గంటల క్రితమే పుట్టిన ఆడశిశువును వదిలివెళ్లారు. పారిశుద్ధ్య సిబ్బంది శిశును గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో శిశువు ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం నవజాత బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: AV Ranganath: బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ తీరును పరిశీలించిన హైడ్రా కమిషనర్..
బాత్‌రూములో తలకిందులుగా ఉన్న ఒక బకెట్ కింద నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో ప్రజలు సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు వెళ్లి బకెట్ చూడగా, దాని కింద కొన్ని గంటల క్రితమే జన్మించిన ఆడ శిశువు ఉంది. బొడ్డుతాడు పడి ఉన్న శిశువును చూసి పారిశుద్ధ్య కార్మికులు షాక్ అయ్యారు. వెంటనే పాపను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శిశువు పరిస్థితి ప్రస్తుతం నిలకడి ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పాప తల్లిదండ్రుల కోసం పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు అనుమానితులెవరూ గుర్తించబడలేదు. పాప తల్లిదండ్రులను గుర్తించడంలో సాయపడాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విధంగా రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని కడలూర్ జిల్లా, చిదంబరం సమీపంలోని పిచ్చవరం పట్టణంలో ఒక ఇంటి వెనక నవజాత బాలికను కనుగొన్నారు. గ్రామస్తులు గుర్తించి శిశువుకు వెంటనే వైద్య సదుపాయం అందించారు. ఇటీవల కాలంలో తమిళనాడులో ఆడశిశువులను ఇలా వదిలేసే ఘటనలు ఆందోళన పెంచుతున్నాయి.