New Toll Rules: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం టోల్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. టోల్ చెల్లింపులు బకాయి ఉంటే, వాహనానికి సంబంధించిన కీలక ప్రభుత్వ సేవలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ స్కాన్ అవుతుంది, బీప్ సౌండ్ వస్తుంది, గేట్ పైకి లేస్తుంది.. ఇక పని అయిపోయిందనుకుంటాం. కానీ, ఇకపై అలా కాదు. టోల్ డబ్బు బకాయి ఉంటే దాని ప్రభావం నేరుగా మీ వాహన పత్రాలపై పడనుంది.
చట్టపరమైన ఆమోదం పొందిన కొత్త నియమాలు
సెంట్రల్ మోటార్ వెహికల్స్ (రెండవ సవరణ) రూల్స్–2026 కింద ప్రభుత్వం ఈ మార్పులను అమలు చేసింది. ఇవి 1989లో అమల్లోకి వచ్చిన పాత సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌కు సవరణలు చేసింది.. ఈ మార్పుల ప్రధాన లక్ష్యం ఏంటంటే.. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థను బలోపేతం చేయడం.. టోల్ ఎగవేతను అరికట్టడం.. భవిష్యత్తులో అడ్డంకులు లేని టోల్ విధానం అమలు చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు..
‘చెల్లించని టోల్’కు స్పష్టమైన నిర్వచనం
కొత్త నియమాల్లో తొలిసారిగా “Unpaid User Fee (చెల్లించని వినియోగదారు రుసుము)” అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. వాహనం టోల్ ప్లాజా గుండా వెళ్లినట్లు ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో నమోదు అయ్యి, కానీ జాతీయ రహదారుల చట్టం–1956 ప్రకారం చెల్లించాల్సిన టోల్ మొత్తాన్ని చెల్లించకపోతే, అది టోల్ బకాయిగా పరిగణించబడుతుంది.
ఈ సేవలపై నేరుగా ప్రభావం
టోల్ బకాయిలు ఉన్న వాహనాలకు. వాహన యాజమాన్య బదిలీకి అవసరమైన NOC జారీ కాదు.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనం బదిలీకి అనుమతి ఉండదు.. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రిన్యూవల్ నిలిపివేస్తారు.. అన్ని టోల్ బకాయిలు చెల్లించిన తరువాతే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నమాట..
వాణిజ్య వాహనాలకు మరింత కఠిన నిబంధనలు
వాణిజ్య వాహనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. జాతీయ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే వాహన యజమానులు ముందుగా తమ వాహనానికి ఏవైనా టోల్ బకాయిలు లేవని నిర్ధారించుకోవాలి. బకాయిలు ఉన్నట్లయితే పర్మిట్ జారీ చేయబడదు. ఇక, ఈ నియమాల అమలుకు ప్రభుత్వం ఫారం–28ను సవరించింది. ఇకపై వాహన యజమానులు.. తమ వాహనంపై చెల్లించని టోల్‌లు లేవని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఫారం–28లోని కొన్ని విభాగాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా జారీ చేసే అవకాశం కూడా కల్పించారు.
అడ్డంకులు లేని టోలింగ్ దిశగా అడుగు
ఈ మార్పులు భవిష్యత్తులో అమలు చేయనున్న మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ వ్యవస్థకు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విధానంలో వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. రద్దీ తగ్గి, ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, టెక్నాలజీ ద్వారా పారదర్శకత పెరుగుతుంది. అయితే, మీ వాహనానికి సంబంధించిన టోల్ చెల్లింపుల్లో ఏవైనా బకాయిలు ఉంటే, అవి వెంటనే క్లియర్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. లేదంటే, భవిష్యత్తులో కీలక వాహన పత్రాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
