విదేశాలకు వెళ్లే భారతీయ విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్. బోర్డింగ్ పాస్‌లో కీలక మార్పులు జరిగాయి. సెప్టెంబర్ 1 నుంచి అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర బోర్డింగ్ పాస్‌పై తప్పనిసరిగా భౌతిక స్టాంప్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. స్మార్ట్‌ఫోన్‌లో చూపించే ఈ-బోర్డింగ్ పాస్‌ను ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు అనుమతించనున్నారు. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
బోర్డింగ్ పాస్ స్టాంపింగ్ ఇక ఉండదు
భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇప్పటివరకు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర బోర్డింగ్ పాస్‌ను చూపించి స్టాంప్ వేయించుకోవాల్సి వచ్చేది. అయితే సెప్టెంబర్ 1 నుంచి ఈ విధానానికి స్వస్తి పలకనున్నారు. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భౌతిక బోర్డింగ్ పాస్‌పై ఇమ్మిగ్రేషన్ అధికారులు స్టాంప్ వేయరు. బోర్డింగ్ పాస్‌లపై సరిగా లేదా తప్పుగా స్టాంప్ పడటం వల్ల వాటిని చదవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నందున తప్పనిసరి బోర్డింగ్ పాస్ స్టాంపింగ్ విధానాన్ని తొలగించినట్లు వెల్లడించారు.
స్మార్ట్‌ఫోన్‌లో చూపిస్తే చాలు
కొత్త విధానం ప్రకారం.. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సమయంలో తమ స్మార్ట్‌ఫోన్‌లోని ఈ-బోర్డింగ్ పాస్‌ను చూపించవచ్చు. అయితే ఫిజికల్ బోర్డింగ్ పాస్ తీసుకెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాన్ని కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు స్వీకరిస్తారు. అయితే సెప్టెంబర్ 1 నుంచి దానిపై ఎలాంటి స్టాంప్ వేయరు. ఇదే సమయంలో ప్రయాణికుల తనిఖీల సమయంలో సీఐఎస్ఎఫ్ బోర్డింగ్ పాస్‌లపై స్టాంప్ వేయడం లేదని అధికారులు స్పష్టం చేశారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల బోర్డింగ్ పాస్‌లపై సీఐఎస్ఎఫ్ స్టాంపింగ్ విధానాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే నిలిపివేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రం ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర బోర్డింగ్ పాస్‌ను ప్రత్యేకంగా చూపించాల్సి వచ్చేది.
అంతర్జాతీయ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ మరో కీలక చర్యకు సిద్ధమవుతోంది. భారతీయ పాస్‌పోర్ట్‌దారుల పాస్‌పోర్ట్‌లపై ఇమ్మిగ్రేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపింగ్‌ను కూడా తొలగించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మరో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అది విజయవంతమైతే దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భారతీయ పౌరుల పాస్‌పోర్ట్‌లపై ఇమ్మిగ్రేషన్ స్టాంపింగ్‌ను తొలగించే అవకాశం ఉంది.

