Site icon NTV Telugu

CIBIL: ఇకపై లోన్లకు CIBIL అవసరం లేదా..? కొత్త వ్యవస్థకు కేంద్రం ప్లాన్..

Cibil

Cibil

CIBIL: బ్యాంకులు లేదా మరేదైనా ఫైనాన్షియల్ సంస్థ నుంచి రుణాలు రావాలంటే మీ ‘‘సిబిల్ స్కోర్(CIBIL) ఎంతుంది అనే ప్రశ్నలే వినిపించేవి. ఇప్పుడు, ఇలా సిబిల్ స్కోర్ చెక్ చేయడం త్వరలో మార్చే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరధిలోని ఆర్థిక సేవల విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్-DFS), సాంప్రదాయ క్రెడిట్ స్కోర్‌లపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కొత్తగా డిజిటల్ లెండింగ్ వ్యవస్థ అయిన ‘‘యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI)ను విస్తరించడానికి కృషి చేస్తోంది.

ప్రస్తుతం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దరఖాస్తుదారుడి క్రిడిట్ అర్హతను అంచనా వేయడానికి ప్రధానంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (CIBIL) స్కోర్‌లపై ఆధారపడుతున్నాయి. అయితే, కొత్తగా తీసుకురావాలని భావిస్తున్న ULIతో మరింత క్రమబద్ధీకరించిన, సమగ్ర రుణ ప్రక్రియను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వేగవంతంగా ఈ ప్రక్రియను తీసుకురావడానికి DFS అన్ని ఆర్థిక సంస్థలకు నెలవారీ ప్రాతిపదికన ULI స్వీకరణను సమీక్షించాలని సూచించింది. ఈ వ్యవస్థలో చేరని వారు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పింది.

జూన్ 26న ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, డీఎఫ్ఎస్ కార్యదర్శి ఎం నాగరాజు, రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా అధికారులు, వివిధ కేంద్ర మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో సమావేశమై దేశవ్యాప్తంగా ULI అమలు గురించి చర్చించారు. రుణాలను అందించే ప్రక్రియను వేగవంతం చేయడం, మరింత సమర్థవంతంగా, సాంప్రదాయ క్రెడిట్ బ్యూరోల(సిబిల్)పై తక్కువగా ఆధారపడటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విధానం విజయవంతంగా అమలు చేయబడితే, రుణాల ఆమోదంలో ULI ఒక పెద్ద మార్పును తీసుకురాగలదు. రుణాలు తీసుకుందామనే వారికి ఈ వ్యవస్థ మరింత అందుబాటులో ఉంటుంది.

యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI) అంటే ఏమిటి?

ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దాని ప్రకారం, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్(ULI) అనేది టెక్నాలజీ, డేటా, పాలసీని సమీకృతం చేయడం ద్వారా రుణ ప్రక్రియను మరింత సులువు చేసే ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్. ఇది రుణదాతలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖల, ఇతర విభాగాల నుంచి హై క్వాటిలీ, ధ్రువీకరించబడిన డేటాను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. వేగవంతమైన మరింత సమగ్రమై క్రెడిట్ డెలివరీని సులభతరం చేస్తుంది.

ULI ముఖ్య లక్షణాలు:

*రుణాలు ఇచ్చే ప్రక్రియను క్రమబద్దీకరించడం,
*క్రెడిట్ అంచనాలకు అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది. *
*రుణగ్రహీతలు తమ ఆర్థిక, ఆర్థికేతర రికార్డులను యాక్సెస్ చేయడానికి అనుమతి ఇవ్వచ్చు.
*రుణాలు ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.
*ఆర్థిక సంస్థల మధ్య సజావుగా డేటా మార్పిడి ప్రారంభిస్తుంది.
*రుణ అర్హతను అంచనా వేయడానికి యుటిలిటీ బిల్ చెల్లింపులు, జీఎస్టీ రికార్డులు వంటి సాంప్రదాయేతర డేటా వనరులన్ని ఉపయోగిస్తుంది.

ప్రయోజనాలు:

*దీని వల్ల గ్రామీణ రుణగ్రహీతలు, చిన్న వ్యాపారాలకు అధికారిక క్రెడిట్ ఎకో సిస్టమ్‌ వ్యవస్థలోకి తీసుకువస్తుంది. *
ఆర్థిక లావాదేవవీల్లో పారదర్శకతను ప్రోత్సహిస్తుంది.
*మోసాలు, అసమర్థతను తగ్గిస్తుంది. రుణాల ప్రాసెసింగ్ ఖర్చులను ఆటోమెటిక్, డిజిటలైజ్ చేస్తుంది.
*పేపర్ వర్క్, ఆపరేషనల్ ఖర్చుల్ని తగ్గిస్తుంది.
*ఎంఎస్ఎంఈ, రైతులు రుణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. సకాలంలో క్రెడిట్ అందిస్తుంది.

Exit mobile version