Site icon NTV Telugu

Cadbury Controversy: మోడీ తండ్రిని అవమానించారు.. క్యాడ్బరీని బ్యాన్ చేయండి

Cadbury Boycott

Cadbury Boycott

Netigens Demanding Boycott Cadbury Chocolate: కావాలనే చేస్తారో లేక అనుకోకుండా అలా కుదిరిపోతుందో తెలీదు కానీ.. ఆయా సంస్థలు తీసే కొన్ని యాడ్స్ మాత్రం సరికొత్త వివాదాలకు తెరలేపుతుంటాయి. ఇప్పుడు క్యాడ్బరీ తీసిన ఒక కొత్త యాడ్ కూడా, ఆ సంస్థని ఊహించని వివాదంలో నెట్టేసింది. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. క్యాడ్బరీనే బ్యాన్ చేయాలని నెటిజన్లు పట్టుబడుతున్నారు. అసలు అంతలా ఆ వీడియోలో ఏముంది? దీపావళి సందర్భంగా విడుదలైన ఆ యాడ్‌ని పరిశీలిస్తే.. ఓ వృద్ధుడు తోపుడు బండిపై ప్రమిదెలను అమ్ముతుంటాడు. అతని పేరు దామోదర్. ఆ వృద్ధుడిని వెతుక్కుంటూ.. సూట్ ధరించిన వ్యక్తి వస్తాడు. గిఫ్టుగా క్యాడ్బరీ చాక్లెట్ ప్యాక్‌ను అందజేస్తాడు. అంతే.. క్యాడ్బరీ చాక్లెట్‌లతో సంతోషాలు పంచమని ఒక మంచి సందేశం ఇచ్చారే తప్ప, అంతకుమించి ఇంకేం లేదు.

కానీ.. ఆ వృద్ధుడి పేరు ‘దామోదర్’ అని పెట్టడమే వివాదానికి కారణమైంది. అది ప్రధాని మోడీ తండ్రి పేరు. మోడీ తండ్రిని తక్కువ చేసి.. ఈ యాడ్‌లో చూపించారని నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి సీరియస్‌గా స్పందించారు. ఈ వీడియోను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘టీవీ చానల్స్‌లో వచ్చే క్యాడ్బరీ చాక్లెట్స్ ప్రకటనల్ని మీరు ఎప్పుడైనా నిశితంగా పరిశీలించారా? ఈ యాడ్స్‌లో తనకంటూ సొంత షాపు లేని ల్యాంప్ సెల్లర్ పేరుని దామోదర్‌గా పెట్టారు. అది ప్రధాని మోడీ తండ్రి పేరు. మోడీ తండ్రిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఈ యాడ్స్‌లో చేశారు. చాయ్ అమ్ముకునే తండ్రి దీపాలను అమ్ముకునే వాడిలాగా ఇందులో చూపించారు. ఇలా చూపించినందుకు క్యాడ్బరీ సంస్థ సిగ్గుపడాలి’’ అంటూ #BoycottCadbury హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. దీంతో.. బాయ్‌కాట్ క్యాడ్బరీ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.

క్యాడ్బరీ సంస్థ ఇలా వివాదాల్లోకి ఎక్కడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు చాక్లెట్ల తయారీలో గొడ్డు మాంసం వినియోగిస్తున్నారంటూ 2021లో ఇది ఆరోపణలు ఎదుర్కొన్నది. అప్పుడు క్యాడ్బరీ.. తాము భారత్‌లో తయారు చేస్తున్న చాక్లెట్లు నూరు శాతం శాకాహార ఉత్పత్తులేనని వివరణ ఇచ్చింది. తమ ఉత్పత్తుల ఇంగ్రేడియెంట్స్‌లో జిలెటిన్ ఉంటే, అది హలాల్ ధ్రువీకరణ పొందిందని.. దీన్ని గొడ్డు మాంసం నుంచి తయారు చేశామని ఆ సంస్థ ప్రకటించింది. అంటే.. పరోక్షంగా అయినా ఆ గొడ్డు మాంసం ఆనవాళ్లు ఉన్నాయన్నది ఆ ప్రకటనని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version