NTV Telugu Site icon

Subhas Chandra Bose: మిస్టరీగానే సుభాష్ చంద్రబోస్ మరణం.. తెరపైకి కొత్త డిమాండ్‌

Anita Bose

Anita Bose

భారత స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది.. అహింసా విధానంతోనే కాదు సాయుధ పోరాటం ద్వారా బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చని పిలుపునిచ్చి.. దాని కోసం ప్రత్యేకంగా శ్రీకారం చుట్టి ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు సుభాష్ చంద్రబోస్.. మహాత్మాగాంధీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని.. పోరుబాట కూడా అవసరం అని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన.. దాని కోసం ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ఆజాద్ హిందూ ఫౌజ్‌ను స్థాపించి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలకపాత్ పోషించారు.. కానీ, సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇప్పటికీ వీడడం లేదు.. 1945, ఆగస్టులో నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. దానిపై మాత్రం భిన్న వాదనలు ఉన్నాయి.. భారత ప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను బయటపెట్టినప్పటికీ.. ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ఓ మిస్టరీలానే మిగిలిపోయాయి. అయితే, ఇప్పుడు కొత్త డిమాండ్‌ తెరపైకి వచ్చింది..

Read Also: Astrology : ఆగస్టు 16, మంగళవారం దినఫలాలు

ఆ డిమాండ్‌ చేస్తున్నది ఎవరో కాదు.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కుమార్తె అనితా బోస్‌.. స్వాతంత్రోద్యమ ఫలాలను భారత ప్రజలు అనుభవిస్తున్న వేళ ఆ ఆనందాన్ని చవిచూసేందుకు నేతాజీ బతికిలేరని పేర్కొన్న ఆమె.. ఇకనైనా ఆయన అస్థికలను భారత్ తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జపాన్ నుంచి అస్థికలను తీసుకువచ్చేందుకు ఇదే తగిన సమయంగా అభిప్రాయపడిన ఆమె.. జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలి.. వాటికి డీఎన్ఏ టెస్ట్‌ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియకు జపాన్ ప్రభుత్వం అంగీకరించందని తెలిపిన అనితా బోస్.. నాన్నగారి మరణంపై ఇప్పటికీ ఎంతో మందికి సందేహాలు ఉన్నాయి.. అస్థికలకు డీఎన్ఏ టెస్ట్‌ చేయడం ద్వారా ఆ సందేహాలను నివృత్తి చేయవచ్చిని పేర్కొన్నారు.

కాగా, 1945 ఆగస్టు 18న ఫార్మోజా సమీపంలో విమాన ప్రమాదం జరిగిందని.. అందులో నేతాజీ మరణించినట్లుగా జపాన్‌ రేడియో ప్రకటించింది. కానీ, అప్పట్లో విమాన ప్రమాదం ఏదీ జరగలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి.. అయితే, నేతాజీ ఎప్పటివరకు జీవించి ఉన్నారు, చివరి రోజులు ఎక్కడ ఏవిధంగా గడిచాయనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. శౌర్యం, ధైర్యం, సంఘటనా కుశలత, ప్రయత్నశీలత, త్యాగం, బలిదానాలనే అత్యుత్తమ ఆదర్శాలను ప్రపంచం ముందుంచిన మహానాయకుడు.. చివరి వరకు ఎక్కడున్నారు..? ఏం చేశారు.. ఎలా చనిపోయారు అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.. మరోవైపు.. జస్టిస్ ఎంకే ముఖర్జీ కమిషన్ మాత్రం విమాన ప్రమాదం తర్వాత కూడా నేతాజీ సజీవుడిగానే ఉన్నారని పేర్కొంది. దాంతో, టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు ఎవరివి? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పుడు ఆయన కూతురు అనితా బోస్‌ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.