Site icon NTV Telugu

NEET Exam 2022: దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష.. రికార్డు స్థాయిలో హాజరైన అభ్యర్థులు

Neet Exam

Neet Exam

NEET EXAM 2022: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆన్​లైన్ ద్వారా నిర్వహించే పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి వస్తువులు, ఆభరణాలకు అనుమతి ఇవ్వలేదు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. 1.30 గంటల వరకే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5.20గంటలకు ముగిసింది. దేశంలోని దాదాపు 3,500లకు పైగా పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. మొత్తం రికార్డు స్థాయిలో 18.72 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 10.64 లక్షల మంది మహిళా అభ్యర్థులు పరీక్ష రాశారు.

ICSE 10th Results: ఐసీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..

ట్రాఫిక్ జామ్ వల్ల పలుచోట్ల విద్యార్థులు ఆలస్యంగా కేంద్రాలకు రాగా.. వారిని లోపలికి పంపలేదు. ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి లేకపోవడంతో పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. కొన్ని కేంద్రాల్లో ఉన్నతాధికారులు స్పందించి ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించగా.. మరికొన్నిచోట్ల నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించలేదు. ఇటువంటి నిబంధనలు అమలు చేయడం వల్ల విద్యార్థుల ఏడాది కష్టం వృథా అవుతుందంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష ఎంబీబీఎస్, బీడీఎస్, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదం, మెడిసిన్&సర్జరీ (BAMS) మరెన్నో మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత ప్రవేశ పరీక్ష.

Exit mobile version