Site icon NTV Telugu

నీరజ్ చోప్రా గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే !

ఒలింపిక్స్‌లో పసిడి పతకం కోసం ఏళ్ల నుంచి పడిగాపులు..! బంగారు పతకం దాహం తీర్చే ఆటగాడి కోసం ఆశగా ఎదురు చూస్తోన్న సమయంలో ఒక్కడొచ్చాడు..! తాను విసిరే జావెలిన్‌లా దూసుకొచ్చాడు…! ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించి.. మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించాడు..! నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు..!

క్రికెట్‌ తప్ప.. మరో ఆట గురించి పెద్దగా తెలియని.. అసలు పట్టించుకోని మన దేశంలో.. అద్భుతం చేసి చూపించాడు నీరజ్‌ చోప్రా. భారత బంగారు పతకం ఆశలను నెరవేర్చాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జాతీయ జెండాను రెపరెపలాడించాడు..!

నీరజ్‌ చోప్రా సొంతూరు.. హర్యానాలోని పానిపట్‌..! పుట్టింది 24 డిసెంబర్‌ 1997. వ్యవసాయ ఆధారిత కుటుంబం..! ఆ ఫ్యామిలీలో ఎవ్వరికీ క్రీడల గురించి పెద్దగా తెలియదు. అసలు జావెలిన్‌ త్రో అనే ఒక ఆట ఉంటుందన్న అవగాహన కూడా లేదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి చరిత్ర సృష్టించాడు.

నీరజ్‌చోప్రా ఒలింపిక్‌ ప్రయాణం అంత ఈజీగా ఏమీ జరగలేదు..! 13 ఏళ్ల వయసులోనే 90 కేజీల బరువుతో ఒబెసిటీ పేషెంట్‌లా కనిపించాడు. దీంతో తోటి పిల్లలు ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. ఇది గమనించిన నీరజ్‌ చోప్రా అంకుల్‌.. బరువు తగ్గించేందుకు పానిపట్‌ స్పోర్ట్స్‌ స్టేడియంలో చేర్పించాడు. ఈ నిర్ణయం నీరజ్‌ చోప్రా రూట్‌ను.. ఫేట్‌ను మార్చేసింది..!

నీరజ్‌ చోప్రా తొలి గురువు జై చౌధరీ..! అసలు జావెలిన్‌పై నీరజ్‌కి ఆసక్తి పెరగడానికి కూడా ఆయనే కారణం..! జావెలిన్‌ త్రోను అతని చేతికిచ్చి విసరమని చెప్పారు చౌధురి..! ఆ త్రోను నీరజ్‌ అద్భుతంగా వేశాడంటారు జై చౌధురి. 35-40 మీటర్ల దూరం విసిరినట్లు చెబుతారు. నీరజ్‌ది నేచురల్‌ టాలెంట్‌ అంటారు ఆయన..!అలా మొదలైన నీరజ్‌చోప్రా జావెలిన్‌ త్రో ప్రయాణం.. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ అందుకునే వరకు వచ్చింది.

అలా ఒక్క త్రో.. నీరజ్‌ చోప్రా జీవితాన్ని మార్చేసింది. జావెలిన్‌ త్రోపై ఆసక్తిని పెంచింది. దీంతో బద్ధకాన్ని పక్కనపెట్టాడు. బరువు తగ్గేందుకు సిద్ధపడ్డాడు. నీరజ్‌ చోప్రా అథ్లెట్‌ అవుతారని కూడా ఆ కుటుంబం ఊహించలేదు. నిజానికి ఓ రోజు పేపర్‌లో నీరజ్‌ పేరు చూసి ఈ విషయం గుర్తించారు. అప్పటి నుంచి ప్రతి పోటీలోనూ ఆ పేరు మార్మోగిపోతూనే ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. నీరజ్‌ శిక్షణకు కావాల్సినవన్నీ సమకూర్చింది ఆ కుటుంబం.

పానిపట్‌ నుంచి మొదలైన నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో ప్రయాణం.. అంతే వేగంగా దూసుకెళ్లింది. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2013లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌, 2015లో ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. ఇక 2016 తర్వాత నీరజ్‌ కెరీర్‌ మలుపు తిరిగింది. పతకాలు, రికార్డులతో విజయ పథంలో పరుగులు తీస్తోంది. 2016లో జరిగిన సౌత్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం, ఏషియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు. వరల్డ్‌ అండర్‌ 20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా ఆరు స్వర్ణ పతకాలు సాధించాడు. అలాగే ఇండియన్‌ ఆర్మీలో సుబేదారిగా పనిచేస్తూనే అగ్రశ్రేణి అథ్లెట్‌గా అవతరించాడు నీరజ్‌ చోప్రా.

సాఫీగా సాగుతున్న నీరజ్‌ కెరీర్‌కి 2019 సంవత్సరం షాకిచ్చింది. నీరజ్‌ భుజానికి గాయం కావడంతో మళ్లీ జావెలిన్‌ విసరగలుగుతాడా..? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. ఆపరేషన్‌ కారణంగా అతడు ఆ ఏడాదిలో జరిగిన పోటీల్లో పాల్గొనలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత టోక్యో ఒలింపిక్స్‌ టార్గెట్‌గానే అడుగులు వేశాడు. 2020లో ఒలింపిక్‌ కోటాలో పలు పోటీల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మార్చి 2021లో జరిగిన జావెలిన్‌ త్రో పోటీలో పాల్గొని మరో రికార్డు సృష్టించాడు. 2018లో తన పేరుపై ఉన్న 87.43 మీటర్ల రికార్డును 88.07 మీటర్లతో బద్దలుకొట్టాడు.

ఏ అథ్లెట్‌కి అయినా.. ఒలింపిక్‌ పతకం సాధించాలన్న కోరిక ఉంటుంది..! అదే టార్గెట్‌ కూడా..! నీరజ్‌ కూడా ఒలింపిక్‌లో సత్తా చాటేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. రియోలో మిస్సైనా.. టోక్యో మెడల్‌ కొట్టాలన్న కసితో సిద్ధమయ్యాడు. ఇందుకోసం కఠోర శిక్షణ తీసుకున్నాడు. నీరజ్‌ చోప్రా కోచ్‌ల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి జై చౌధురి దగ్గర మెళకువలు నేర్చుకున్న నీరజ్‌ చోప్రా తర్వాత విదేశీ కోచ్‌ల సాయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా కోచ్‌ గారీ కాల్వర్ట్‌ శిక్షణలో అనేక పతకాలు సాధించాడు. ఒలింపిక్‌ కోసం జర్మన్‌ వెటరన్‌ అథ్లెట్‌ హాన్‌ శిక్షణలో మరింత రాటుదేలాడు. జావెలిన్‌ త్రోలో హాన్‌కి ప్రపంచ రికార్డు ఉంది. అతను ఏకంగా 104. 80 మీటర్లు విసిరాడు. ఇప్పుడు ఆయన శిక్షణలో ఏకంగా బంగారు పతకం సాధించాడు నీరజ్‌
ఒక్క గోల్డ్‌ వస్తే చాలు అంటూ యావత్‌ భారతమంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న సమయంలో.. అదరగొట్టాడు నీరజ్‌చోప్రా. గోల్డ్‌ కొట్టి చూపించాడు. జావెలిన్‌ త్రో మొత్తం మనోడి హవానే..! అతని దారిదాపుల్లోకి కూడా ఎవరూ లేరు. ఆటలంటే క్రికెట్‌ అనుకునే మన దేశంలో అథ్లెట్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు నీరజ్. వందేళ్ల తర్వాత దేశం బంగారు పతకం పొందేలా చేశాడు. ఈ మెడల్‌ను మిల్కాసింగ్‌కి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు నీరజ్‌ చోప్రా..!

Exit mobile version