మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓటర్లను దర్శనం చేసుకుంటున్నారు. ఇంకోవైపు అన్ని పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓట్లు కోసం అన్ని వర్గాలకు హామీలు ఇచ్చేస్తున్నారు. అయితే ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి మాత్రం మరో అడుగు ముందుకేసి.. తనను అసెంబ్లీకి పంపిస్తే.. పెళ్లికాని బ్రహ్మచారులందరికీ పెళ్లిళ్లు చేస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఈ వార్త వైరల్‌గా మారింది.
శరద్ పవార్ పార్టీకి చెందిన అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే నియోజకవర్గంలోని బ్రహ్మచారులందరికీ వివాహం జరిపిస్తానని హామీ ఇచ్చారు. యువకులందరికీ పెళ్లిళ్లు చేయడమే కాదు.. జీవనోపాధిని కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు లేక పెళ్లిళ్లు కూడా కాలేదన్నారు. అందుకే తనను అసెంబ్లీకి పంపిస్తే.. బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసే బాధ్యత తనదేనన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తానని ప్రకటించారు. తన ప్రధాన ప్రత్యర్థి, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ నేత, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ధనుంజయ్ ముండేను విమర్శిస్తూ రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.
288 స్థానాలు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి, విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలు నువ్వానేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈసారి అధికారం ఏ కూటమికి కట్టబెడతారో వేచి చూడాలి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి.