జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్‌తో జత కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. ఫలితాల్లో కూటమినే విజయం సాధించింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా పార్టీ నవా-ఇ-సుభా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒమర్ అబ్దుల్లా 49 మంది శాసనసభ్యులతో ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. ఒమర్ అబ్దుల్లాకు నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల కూడా మద్దతు ఇచ్చారు. దీంతో ఎన్సీ బలం మరింత పెరిగింది.
జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 సీట్లు సాధించింది. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా బలం సరిపోతుంది. ఎన్సీకి అవసరమైన మెజార్టీ లభించింది.
నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలకు ఒమర్ అబ్దుల్లా కృతజ్ఞతలు తెలియజేశారు. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కోరతామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం తీర్మానాన్ని ఆమోదించడం కేబినెట్ మొదటి పని అని ఎన్సీ నేతలు పేర్కొన్నారు. తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని చెప్పారు.