మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. తన అరెస్ట్ అక్రమం అని అమరావతి ఎంపీ నవనీత్ రాణా మహారాష్ట్ర సర్కార్ తో పాటు సీఎం ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు చేస్తున్నారు.తనను అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు అమర్యాదగా ప్రవర్తించారంటూ..పార్లమెంట్ సభ్యురాలిగా తన హక్కులకు భంగం కలిగిందంటూ నవనీత్ రాణా పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ముందు ఫిర్యాదు చేసింది. ఇటీవల పార్లమెంటరీ కమిటీకి నవనీత్ రాణా ఫిర్యాదు చేయడంతో సోమవారం ఆమెను తమ ముందు హాజరు కావాలంటూ కమిటీ పిలిచింది. ఈ నేపథ్యంలో ఆమె మహారాష్ట్ర సీఎంతో పాటు పలువురు పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ముంబైలోని ఒక పోలీస్ స్టేషన్ లో పోలీసులు తనను చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేయడమే కాకుండా.. అమానవీయంగా ప్రవర్తించారంటూ కమిటీ ముందు వాదనలు వినిపించింది. కమిటీ ముందు హాజరయ్యానని… పోలీసులు నాతో ఎలా ప్రవర్తించారో…నాపై కులం పేరుతో ఎలా వేధించారో కమిటీ ముందు చెప్పానని.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ముంబై పోలీస్ కమిషనర్ వరకు అందరి పేర్లను కమిటీ ముందు వెల్లడించినట్లు నవనీత్ రాణా వెల్లడించారు. పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ముంబై ఉన్నతాధికారులను తమ ముందు హాజరు కావాలని ఆదేశించే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ తో పాటు ఆమె భర్త రవి రాణాలు సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించారు. దీంతో వివాదం మొదలైంది. నవనీత్ ఇంటి ముందు శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఈ వివాదంపై మహారాష్ట్ర పోలీసులు ఏప్రిల్ 23న నవనీత్, ఆమె భర్త రవి రాణాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల ముంబై ప్రత్యేక కోర్ట్ మే 4న నవనీత్ దంపతుకు బెయిల్ మంజూరు చేసింది.