Helicopter Incident: మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు తృటిలో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలోని మారుమూల జిల్లా గడ్చిరోలిలో స్టీల్ ప్రాజెక్టుకు శంకుస్థాపనకు వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని, తప్పిపోయింది. అయితే, పైలట్ చాకచక్యంగా తిరిగి హెలికాప్టర్‌ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. హెలికాప్టర్‌లో డిప్యూటీ సీఎంలతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ ఉన్నారు.
అహేరి తాహసీల్‌లో రూ. 10,000 కోట్లతో సుర్జగద్ ఇస్పాత్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి ముగ్గురూ గడ్చిరోలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అజిత్ పవార్ తమకు ఎదురైన ప్రమాదాన్ని గురించి ప్రజలకు చెప్పారు. ల్యాండింగ్ చేయడంలో పైలట్ నైపుణ్యాన్ని ప్రశంసించారు.
‘‘నాగ్‌పూర్ నుండి గడ్చిరోలికి హెలికాప్టర్ సరిగ్గా బయలుదేరింది. మా టేకాఫ్ తర్వాత నేను మేఘాలను చూస్తూ చాలా హాయిగా ఉన్నాను. వాటిని చూడమని ఫడ్నవీస్‌కు కూడా చెప్పాను. అయితే, ప్రయాణ సమయంలో, రుతుపవనాల మేఘాల కారణంగా హెలికాప్టర్ దాని మార్గాన్ని కోల్పోయింది. ఫడ్నవిస్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు, నేను ఆందోళన చెందుతూ ఉన్నాను. అతను ఇంతకు ముందు ఆరు ప్రమాదాలను ఎదుర్కొన్నానని, మనం సురక్షితంగా ఉంటానని అతను నాకు చెప్పాడు. ఆందోళన చెందొద్దని ఫడ్నవీస్ పదేపదే తనకు చెప్పాడు’’ అని అజిత్ పవార్ వెల్లడించారు.
తాను సురక్షితమైన ల్యాండింగ్ కోసం ఆందోళన చెందానని, కానీ ఫడ్నవీస్ చాలా కూల్‌గా ఉన్నాడని, ఉదయ్ సమంత్ తనను ల్యాండింగ్ కోసం సైట్ చూడమని చెప్పాడని అజిత్ పవార్ వెల్లడించారు. ల్యాండింగ్ స్థలాన్ని కిటికీలో నుంచి చూశాక నాకు ప్రశాంతత కలిగిందని చెప్పారు.