Nagpur Violence: నాగ్‌పూర్ హింసలో దుర్మార్గమైన చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు మతోన్మాద గుంపు ప్రార్థనలు ముగిసిన తర్వాత వీధుల్లోకి వచ్చి, నినాదాలు చేస్తూ హింసకు తెగబడ్డారు. వాహనాలను తగులబెట్టడంతో పాటు ఒక వర్గం ఇళ్లను, ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేశారు. సోమవారం నాగ్‌పూర్ నగరాన్ని కుదిపిపేసిన ఈ హింసాకాండలో నిందితులు ఘోరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. నగరంలో భల్దార్‌పూరా ప్రాంతంలో అల్లరి మూకను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై నిందితులు ఆమె యూనిఫాం చింపి, ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారు.
Read Also: Nagpur riots: నాగ్‌పూర్ అల్లర్ల కీలక సూత్రధారి ఫాహిమ్ ఖాన్ అరెస్ట్..
గణేష్ పేట్ పోలీసులు ఆ అల్లరిమూకపై కేసు నమోదు చేశారు. మహిళా అధికారి పట్ల ఈ దురుసు ప్రవర్తనను అన్ని స్థాయిల్లో ఖండిస్తున్నామని, ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, మహిళా పోలీస్ అధికారిని అల్లరి మూక కార్నర్ చేసి లైంగికంగా వేధించారు. అయితే, వెంటనే తోటి పోలీస్ సిబ్బంది వచ్చి ఆమెను రక్షించి, సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.
‘‘ అల్లరి మూక నలుగురు డీసీపీలపై, పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఒక మహిళా పోలీస్ అధికారిని కార్నర్ చేసి, ఆమె బట్టలు చింపడానికి ప్రయత్నించి, దురుసుగా ప్రవర్తించారు. అయితే, ఆ గుంపు నుంచి ఆమె తప్పించుకోగలిగారు’’ అని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనపై గణేష్ పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా అధికారిపై లైంగిక దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.