Hoax Bomb Threat: విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. గత నెల కాలంగా దేశంలోని పలు ఎయిర్ లైన్ సంస్థలకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Ranji Trophy: మెగా వేలానికి ముందు వీర బాదుడు.. ట్రిపుల్ సెంచరీ సాధించిన లోమ్రోర్
187 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఉన్న విమానం బెదిరింపు నేపథ్యంలో ఉదయం 9 గంటల తర్వాత స్వామి వివేకానంద విమానాశ్రయంలో దిగిందని రాయ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ సింగ్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానంలో బాంబు ఉందని ఒక ప్రయాణికుడు సిబ్బందికి చెప్పాడు. ఈ సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి అందించడంతో విమానాన్ని రాయ్‌పూర్ మళ్లించారు. ల్యాండింగ్ అయిన వెంటనే, భద్రతా తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ విమానాశ్రయానికి చేరుకుని ప్రయాణికులను దింపి, విమానం, ప్రయాణికులు లగేజీని క్షణ్ణంగా తనిఖీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విమానం మధ్యామ్నం 12 గంటల సమయంలో కోల్‌కతా బయలుదేరింది. అక్టోబర్ 24న కోల్‌కతా నుండి బిలాస్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) వెళ్లే అలయన్స్ ఎయిర్ విమానానికి కూడా ఇదే విధమైన బెదిరింపు వచ్చింది, ఆ తర్వాత ఆ విమానాన్ని బిలాస్‌పూర్ విమానాశ్రయంలో తనిఖీ చేసినప్పటికీ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.