Site icon NTV Telugu

Nag Ashwin: ‘డిజైన్ బాగాలేదు, మార్చేయండి’ అంటూ రైల్వే మినిస్టర్‌కి సలహా

Nag Ashwin On Tirupati Railway

Nag Ashwin On Tirupati Railway

తిరుమల, తిరుపతి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకోవడం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఎలా తరలి వస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. భక్తులు ఇలా పోటెత్తుతుండడం వల్లే తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ రద్దీగానే ఉంటోంది. అలాంటి రద్దీని తట్టుకునేలా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆల్రెడీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కాంట్రాక్టు కూడా ఇచ్చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన కొత్త స్టేషన్ డిజైన్ ఫోటోల్ని సైతం కేంద్రమంత్రి షేర్ చేశారు.

అయితే.. ఈ కొత్త డిజైన్‌పై చాలామంది నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారత సంస్కృతికి ఏమాత్రం దగ్గరగా లేని ఈ డిజైన్‌ని వెంటనే మార్చాల్సిందిగా కోరుతున్నారు. బహుశా సౌకర్యాలు ఉన్నతంగా ఉండొచ్చేమో గానీ, డిజైన్ మాత్రం పుణ్యక్షేత్రాన్ని ప్రతిబింబించేలా లేదని, ఏదో సాదా సీదా భవనంలా ఉందంటూ పేర్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. అది ఓ ఐటీ భవనంలా ఉందని, డిజైన్‌పై పునరాలోచించాలని కోరుతున్నారు. ఈ అభిప్రాయాలపై కేంద్రమంత్రి నుంచి గానీ, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి గానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో.. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ రంగంలోకి దిగాడు. డిజైన్ ఏమాత్రం బాగాలేదని, దాన్ని వెంటనే మార్చమంటూ తనదైన శైలిలో సలహా ఇచ్చాడు.

‘‘డియర్ సర్.. మీ ట్వీట్ కిందున్న కామెంట్లను ఓసారి చూశారంటే, ఈ కొత్త డిజైన్ ఎవ్వరికీ నచ్చలేదని మీకు స్పష్టమవుతుంది. ఇదేదో ఐటీ పార్క్ డిజైన్‌లా, వెస్ట్రన్ నుంచి కాపీ కొట్టినట్టు ఉంది. తిరుపతి అనేది ఓ దైవ చింతన ఉన్న ప్రదేశం. ఇండియన్ ఆర్కిటెక్ట్ మీద పట్టున్న వారితో డిజైన్ చేయించండి. అంతేగానీ ఇలా గ్లాసులతో, స్టీల్ కాపీలతో కాదు’’ అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Exit mobile version