BMC Elections: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు పూర్తయినా రాజకీయ వివాదాలు ఇంకా ముగియడం లేదు. తాజాగా గురువారం రోజున ప్రతిష్టాత్మక మేయర్ స్థానం గురించి లాటరీ డ్రా జరిగింది. ఈ లాటరీలో ముంబై మేయర్ పీఠం ‘‘మహిళ’’కే దక్కింది. ‘‘జనరల్ మహిళ’’కు ముంబై మేయర్ రిజర్వ్ చేయబడింది. అయితే, ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన యూబీటి మాత్రం ఈ ప్రక్రియ, ఫలితాలపై తీవ్ర అభ్యంతరం తెలియజేయడంతో గందరగోళం నెలకొంది.
ముంబై మేయర్ పదవి రిజర్వేషన్ పై ఉద్ధవ్ సేన నాయకురాలు, మాజీ ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ బీఎంసీ మేయర్ పీఠాన్ని ఎందుకు ఓబీసీ కేటగిరిలో చేర్చలేదని ప్రశ్నించారు. గత రెండు పర్యాయాలుగా ఈ పదవికి రిజర్వేషన్ లేకుండానే ఉందని ఆమె అన్నారు. ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నామని పరిశీలిస్తామని రాష్ట్రమంత్రి తెలిపారు. అధికార కూటమికి లబ్ధి చేకూరేలా ఫిక్సింగ్ జరిగినట్లు ఉద్ధవ్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఎస్టీ కేటగిరీ రిజర్వేషన్ల నిబంధనల్ని మార్చిందని, ఆ కేటగిరి నుంచి కనీస సంఖ్యలో సభ్యులు ఉండాలనే నిబంధనల్ని చివరి నిమిషంలో మార్చారని కిషోరి అన్నారు. ఈ కేటగిరీ నుంచి ఉద్ధవ్ పార్టీకి మాత్రమే ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నందున, ముంబైని ఉద్దేశపూర్వకంగా ఎస్టీ కేటగిరీలో చేర్చలేని అన్నారు.
Read Also: Honour KIilling: యూపీలో పరువు హత్య.. సోదరి, ఆమె ముస్లిం ప్రియుడి హత్య..
ఇటీవల జరిగిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి కైవసం చేసుకుంది. గత రెండు దశాబ్ధాలుగా ఠాక్రేల ఆధిపత్యం ముగిసింది. బీజేపీ-షిండే సేన కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. 227 స్థానాలు ఉన్న ముంబైలో బీజేపీ 89, షిండే శివసేన 29 స్థానాలు సాధించాయి. అధికారానికి అవసరమైన మెజారిటీ 114 సీట్లు. కాగా బీజేపీ+షిండే సేన మ్యాజిక్ ఫిగర్ దాటి స్థానాలు గెలుచుకున్నాయి.
రిజర్వేషన్ ప్రకారం, పూణే, ధూలే, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC), నాందేడ్, నవీ ముంబై, మాలేగావ్, మీరా భయాందర్, నాసిక్ మరియు నాగ్‌పూర్‌లలో మేయర్ పదవులు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. మరోవైపు, లాతూర్, జల్నా, థానే మూడు మునిసిపల్ కార్పొరేషన్లు షెడ్యూల్డ్ కులాలకు (SC) రిజర్వ్ చేయబడ్డాయి, వీటిలో లాతూర్, జల్నా SC మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి.
మొత్తం ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కేటగిరీకి రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో, అకోలా, చంద్రపూర్, అహల్యానగర్, జల్గావ్ OBC మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే, పన్వెల్, ఇచల్కరంజి, కొల్హాపూర్, ఉల్హాస్‌నగర్ OBC అభ్యర్థులకు కేటాయించారు.
