MP Parvesh Verma Demands Narco Test To Manish Sisodia: ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు తారాస్థాయి విమర్శలు గుప్పించుకుంటున్నారు. ముఖ్యంగా.. లిక్కర్ స్కామ్ వ్యవహారం తెరమీదకి వచ్చాక, కేజ్రీవాల్‌ని ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ లిక్కర్ స్కామ్‌ని తీసుకొచ్చారని ఆప్ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అయితే బీజేపీపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రూ.63 వేల కోట్లను బీజేపీ ఖర్చుచేస్తోందని, అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీష్ సిసోడియాకు నార్కో టెస్ట్ నిర్వహించాలని అన్నారు. ‘ఆప్ ఎమ్మెల్యేలతో బేరం జరిగిందని ఆయన చెప్తున్నారు.. బేరమాడింది ఎవరో బయటపెట్టాలి’ అని పర్వేష్ నిలదీశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎప్పుడు, ఏంచెప్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆయన రోజుకో అబద్ధం చెప్తున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ అవినీతిలో ఒక్కో మంత్రి ఇరుక్కుంటున్నారని ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో వింతగా వ్యవహరిస్తున్నారని.. లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మనీష్ సిసోడియా యోగ ప్రాక్టీస్ చేయాలని, ఎందుకంటే తీహార్ జైలుకి వెళ్లిన తర్వాత ఇక్కడి వసతులు అక్కడ ఉండవని ఎద్దేవా చేశారు. ఫైల్స్‌పై సీఎం కేజ్రీవాల్ సంతకాలు పెట్టకుండా తప్పించుకుంటున్నారని పర్వేష్ వర్మ దుయ్యబట్టారు.
