Site icon NTV Telugu

Monkeypox: కేరళలో 20 మంది క్వారంటైన్.. మరణించిన వ్యక్తితో సంబంధం

Monkeypox In Kerala

Monkeypox In Kerala

monkeypox in kerala, 20 people Quarantined: మంకీపాక్స్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవల కాలంలో వరసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే స్పెయిన్ లో మంకీపాక్స్ వల్ల ఇద్దరు చనిపోయారు. ఇదిలా ఉంటే ఇండియాలో ఇప్పటికే నలుగురికి మంకీపాక్స్ వ్యాధి సోకింది. కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత మంకీపాక్స్ వ్యాధికి గురయ్యారు. ఇందులో 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ తో మరణించడం అందరిలోనూ కలవరానికి గురిచేస్తోంది. కేరళకు ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ గుర్తించారు. అయితే చికిత్స తీసుకుంటున్న క్రమంలో త్రిసూర్ లో అతడు మరణించాడు. త్రిస్సూర్ జిల్లాలోని చావక్కల్ కురంజియూర్ కు చెందిన యువకుడికి ఇటీవల మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. అయితే అతడు మంకీపాక్స్ తో పాటు మెదడు వాపు కారణంగా మరణించినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.

తాజాగా మరణించిన వ్యక్తితో సంబంధం ఉన్న 20 మందిని క్వారంటైన్ చేశారు అధికారులు. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు అతని స్నేహితుల 10 మందితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 20 మందిని క్వారంటైన్ చేశారు అధికారులు. త్రిస్సూర్ జిల్లాలోని పున్నయూర్ గ్రామంలోని పంచాయతీ సభ్యులు కూడా ఓ సమావేశాన్ని నిర్వహించి బాధిత వ్యక్తి మరణించిన తర్వాత చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. ప్రస్తుతం మరణించిన వ్యక్తి కాంటాక్ట్స్ వెతికే పనిలో పడ్డారు అధికారులు. కాంటాక్ట్ వ్యక్తులు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు.

ఇదిలా ఉంటే ఇండియాలో మంకీపాక్స్ తొలి మరణం సంభవించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజలు భయాందోళనకు గురికావద్దని అన్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏదైనా లక్షణం కనిపిస్తే సకాలంలో తెలియజేయాలని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని 78 దేశాల్లో 18 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. సరైన క్రమంలో వ్యాధిని గుర్తించి, చికిత్స తీసుకుంటే వ్యాధి ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version